పింఛనుకు ఎన్‌పీఎస్ భరోసా.. | nps to ensure that pension .. | Sakshi
Sakshi News home page

పింఛనుకు ఎన్‌పీఎస్ భరోసా..

Published Mon, Oct 5 2015 1:25 AM | Last Updated on Thu, Sep 27 2018 4:42 PM

పింఛనుకు ఎన్‌పీఎస్ భరోసా.. - Sakshi

పింఛనుకు ఎన్‌పీఎస్ భరోసా..

రిటైర్మెంట్ తర్వాత వృద్ధాప్యంలో నిలకడగా ఆదాయం వచ్చే మార్గాలు ఉండవు. కానీ ఖర్చులు మాత్రం తడిసి మోపెడు ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆదుకునేవి పింఛను పథకాలు. ఇవి వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత, స్థిరత్వాన్ని ఇస్తాయి. జీవన విధానాల్లో రాజీపడకుండా, మరొకరిపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా ఆత్మగౌరవంతో జీవించేందుకు భరోసానివ్వగలవు. ఈ కోవకి చెందినదే జాతీయ పింఛను పథకం (నేషనల్ పెన్షన్ స్కీమ్- ఎన్‌పీఎస్). తాజాగా ఇందులో అదనంగా మరో రూ. 50,000 దాకా ఇన్వెస్ట్ చేసే మొత్తాలకు కూడా ఆదాయ పన్ను మినహాయింపులు వర్తింపచేస్తున్న నేపథ్యంలో దీనిపై ప్రత్యేక కథనం.
 
అసలు ఎన్‌పీఎస్ అంటే ఏమిటి?

 పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఏ) పరిధిలో ఈ పథకం ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వివిధ పింఛను పథకాలతో పోలిస్తే ఎన్‌పీఎస్‌లో మెరుగైన ఫీచర్లే ఉన్నాయి. వీటిలో కొన్ని..
 
ఫండ్ మేనేజ్‌మెంట్ చార్జీ ప్రపంచంలోనే అత్యంత తక్కువగా 0.01 శాతమే. పెట్టుబడుల వివరాలను ఆన్‌లైన్లోనే చూసుకునే వీలు కల్పిస్తోంది. ఉద్యోగాలు మారినా, ఇతర ప్రాంతాలకు మారినా దీనికి పూర్తిస్థాయి పోర్టబిలిటీ ఉంటుంది. సర్వీస్ ప్రొవైడర్లు, పెన్షన్ ఫండ్ మేనేజర్లు, ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్లు, యాన్యుటీ సర్వీస్ ప్రొవైడర్లను ఎంచుకునే వీలు కల్పిస్తోంది. అలాగే ఒక సర్వీస్ ప్రొవైడర్ నుంచి మరో దానికి, ఒక ఆప్షన్ నుంచి మరో దానికి కూడా మారే వీలు కల్పిస్తోంది. కట్టే చందాలోను, విత్‌డ్రాయల్, యాన్యుటీ ప్లాన్‌ల విషయంలో వెసులుబాటు ఉంటుంది.
 
పన్ను ప్రయోజనాలు ..
ప్రధాన అకౌంటుకు వచ్చే పన్ను ప్రయోజనాలు పరిశీలిస్తే.. వేతన జీవులు ఎన్‌పీఎస్‌కు తమ జీతంలో (బేసిక్, డీఏ కలిపి) 10 శాతం దాకా కట్టే చందాకు సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులు ఉంటాయి. దీనికి రూ. 1.5 లక్ష దాకా పరిమితి వర్తిస్తుంది. అదనంగా సెక్షన్ 80సీసీడీ (1బీ) కింద మరో రూ. 50,000 దాకా చందాకు పన్ను మినహాయింపులు ఉంటాయి. ఉద్యోగి కంపెనీ కూడా సదరు ఉద్యోగి ఎన్‌పీఎస్ అకౌంటుకు చందా కట్టొచ్చు. సదరు ఉద్యోగి జీతంలో (బేసిక్, డీఏ కలిపి) 10 శాతం దాకా కట్టే మొత్తంపై సెక్షన్ 80సీసీడీ కింద మినహాయింపులు వర్తిస్తాయి.  అదే స్వయం ఉపాధి పొందే వారి విషయంలోనైతే.. తమ స్థూల ఆదాయంలో 10 శాతం దాకా కట్టే మొత్తానికి 80సీ కింద పన్ను మినహాయింపు ఉంటుంది. దీనికీ రూ. 1.5 లక్షల దాకా పరిమితి వర్తిస్తుంది. అదనంగా మరో రూ. 50,000 చందాకు 80సీసీడీ (1బీ)కింద మినహాయింపు లభిస్తుంది.

ఇక విత్‌డ్రాయల్ విషయానికొస్తే.. ఏకమొత్తంగా వెనక్కి తీసుకునే మొత్తానికి సబ్‌స్క్రయిబరే పన్ను కట్టాల్సి ఉంటుంది. యాన్యుటీలో ఇన్వెస్ట్ చేసే మొత్తం.. పన్ను పరిధిలోకి రాదు.అయితే, నెలవారీ పొందే పింఛన్‌ను మాత్రం ఆదాయం కిందే పరిగణించి.. పన్ను విధించడం జరుగుతుంది. మరోవైపు, రెండో తరహా స్వచ్ఛంద ఖాతాకు ఎటువంటి పన్నుపరమైన ప్రయోజనాలూ ఉండవు. క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ వర్తిస్తుంది.
 
ఇది పనిచేసే తీరు ..
ఎన్‌పీఎస్‌లో చేరిన ప్రతి సబ్‌స్క్రయిబర్‌కి పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంటు నంబరు (ప్రాణ్) అనేది కేటాయించడం జరుగుతుంది. రిటైరయ్యే దాకా సబ్‌స్క్రయిబర్ చందా కడతారు. పదవీ విరమణ తర్వాత అప్పటి దాకా జమయిన దాంట్లో నుంచి కొంత భాగాన్ని ఏకమొత్తంగా తీసుకోవచ్చు. రిటైర్మెంట్ తర్వాత నెలవారీ పింఛను వచ్చేలా మిగతా మొత్తాన్ని యాన్యుటీలో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ చందా కట్టే దశలోనే సబ్‌స్క్రయిబర్ మరణించిన పక్షంలో.. పూర్తి మొత్తాన్ని నామినీకి అందజేస్తారు.
 ఇక, ఎన్‌పీఎస్‌లో రెండు రకాల అకౌంట్లు ఉంటాయి. మొదటి తరహా అకౌంటులో జమయ్యే మొత్తం కూడా రిటైర్మెంట్ అవసరాలకు పొదుపు కోసం ఉద్దేశించినదే. ఇందులో నుంచి ఎప్పుడు పడితే అప్పుడు విత్‌డ్రాయల్ కుదరదు. మరోవైపు రెండో రకం అకౌంటు.. స్వచ్ఛంద పొదుపు పథకం లాంటిది. మొదటి ఖాతాలో చేసే ఇన్వెస్ట్‌మెంట్‌తో పాటు అదనంగా పొదుపు చేయదల్చుకున్న వారు దీన్ని ఎంచుకోవచ్చు. ఈ ఖాతా నుంచి సబ్‌స్క్రయిబర్ తనకు కావాల్సినప్పుడు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ అకౌంటుతో ఎటువంటి పన్ను ప్రయోజనం ఉండదు.
 
మూడు ఫండ్లు..
ఎన్‌పీఎస్‌కి కట్టే చందాను ఫండ్ మేనేజరు.. ఈక్విటీ, కార్పొరేట్ బాండ్లు లేదా ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడి పెట్టే ఆప్షన్‌ను సబ్‌స్క్రయిబరే ఎంచుకోవచ్చు. మళ్లీ ఇందులోనూ చందాదారుకు రెండు ఆప్షన్లు ఉంటాయి. మొదటిదైన యాక్టివ్ చాయిస్ కింద.. సబ్‌స్క్రయిబర్ తానే సొంతంగా ఎంతెంత మొత్తాన్ని మూడు ఫండ్లలో ఇన్వెస్ట్ చేయాలన్నది ఎంచుకోవ చ్చు. చందా మొత్తంలో ఈక్విటీ ఫండ్‌లో గరిష్టంగా 50 శాతం దాకా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇక రెండో విధానమైన ఆటో చాయిస్‌లో .. సబ్‌స్క్రయిబర్ వయస్సు ఆధారంగా మూడు ఫండ్లలో నిర్దిష్ట నిష్పత్తి ప్రకారం పెట్టుబడుల కేటాయింపు ఉంటుంది. వయస్సు తక్కువగా ఉన్నప్పుడు ఈక్విటీలకు అధికంగా ఉండే కేటాయింపులు వయస్సు పెరిగే కొద్దీ తగ్గుతూ వస్తాయి.  ఈక్విటీ విభాగంలో సింహభాగాన్ని ఇండెక్స్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు.
 
విత్‌డ్రాయల్ ఇలా ..

కొత్తగా చేర్చిన నిబంధన ప్రకారం తొలి శ్రేణి ఎన్‌పీఎస్ అకౌంటులో నుంచి పదేళ్ల తర్వాత.. అప్పటిదాకా జమయిన చందా మొత్తంలో 25 శాతం దాకా విత్‌డ్రా చేసుకోవచ్చు. అటుపైన అయిదేళ్ల వ్యవధి తర్వాత మరోసారి విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే ఇలా వెనక్కి తీసుకోవడానికి ఒక ప్రత్యేకమైన అవసరం అంటూ ఉండాలి. పిల్లల ఉన్నత విద్య, వారి పెళ్లిళ్లు, ఇంటి కొనుగోలు, తీవ్రమైన అనారోగ్యానికి చికిత్స తదితర అవసరాల కోసం ఇలా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ ఎన్‌పీఎస్ నుంచి వైదొలగాలనుకుంటే.. ఖాతా తెరిచిన పదేళ్ల తర్వాత లేదా 60 ఏళ్లు పైబడ్డాక వైదొలగవచ్చు. ఎగ్జిట్ సమయంలో వయస్సును బట్టి, ప్రయోజనాలు ఉంటాయి. ఉదాహరణకు 60 ఏళ్ల లోపు వైదొలిగితే.. కార్పస్‌లో 20 శాతం డబ్బు ఏకమొత్తంగా లభిస్తుంది. మిగతా మొత్తాన్ని యాన్యుటీ కోసం ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. అదే కార్పస్ నిధి రూ. 1 లక్ష కన్నా తక్కువే ఉంటే పూర్తి మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇక, 60 ఏళ్లు వస్తే.. కార్పస్‌లో 60 శాతం డబ్బును ఏకమొత్తంగా తీసుకోవచ్చు. మిగతాది యాన్యుటీలో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ కార్పస్ గానీ రూ. 2 లక్షల కన్నా తక్కువే ఉంటే పూర్తి మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement