‘కెప్టెన్’ పాదాలకు నమస్కరించిన సిద్ధూ
చండీగఢ్: పంజాబ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ వేదికపై ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ పాదాలకు నమస్కరించారు. వయసులో, రాజకీయాల్లో తన కంటే సీనియర్ అయిన అమరీందర్ కు నమస్కరించి ఆయన పట్ల గౌరవం ప్రదర్శించారు. వ్యక్తిగత లక్ష్యాల కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమన్న సందేశాన్ని తన చర్య ద్వారా సిద్దూ అందించారు. కార్యక్రమానికి హాజరైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా సిద్ధూను అభినందన పూర్వకంగా చేశారు.
కాగా, పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అమరీందర్ సింగ్ కు ట్విటర్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. పంజాబ్ ను అభివృద్ధి పథంలో నడపాలని ఆకాంక్షించారు. తన కేబినెట్ లో ప్రకాశ్ సింగ్ బాదల్ మేనల్లుడి మన్ ప్రీత్ సింగ్ బాదల్ కు అమరీందర్ చోటు కల్పించారు. అకాలీదళ్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన మన్ ప్రీత్ తర్వాత ప్రకాశ్ సింగ్ తో విబేధించి బయటకు వచ్చారు. తర్వాత పంజాబ్ పీపుల్స్ పార్టీని స్థాపించారు. ఈ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో తాజాగా ఆయనకు మంత్రి పదవి దక్కింది.