వారిని ఎందుకు మినహాయించారు?
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో జనవరి 1 నుంచి 15వ తేదీ వరకు అమలుచేయనున్న సరి, బేసి నంబర్‌ప్లేట్ ఫార్ములా నుంచి ద్విచక్ర వాహనాలను, మహిళలను ఎందుకు మినహాయించారని బుధవారం ఢిల్లీ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై సర్కారు ప్రతిస్పందనను కోరుతూ న్యాయస్థానం కేసుపై విచారణను జనవరి 6 తేదీకి వాయిదా వేసింది. అలాగే తమకు కూడా సరి, బేసి ఫార్ములా నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.
సరి, బేసి ఫార్ములా నుంచి మినహాయింపు కావాలని లాయర్లతో పాటు డాక్టర్లు, వ్యాపారులు కూడా కోరుతున్నారు. ప్రైవేటు స్కూళ్లకు ఊరట సరి, బేసి ప్రయోగాన్ని విజయవంతంగా అమలుచేసేందుకు ప్రభుత్వానికి బస్సులు ఇవ్వడానికి నిరాకరిస్తున్న ప్రైవేటు స్కూళ్లకు ఢిల్లీ హైకోర్టు నుంచి ఊరట లభించింది. బస్సులు ఇవ్వాల్సిందిగా స్కూళ్లపై ఒత్తిడి తేరాదని న్యాయస్థానం ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
జనవరి 1 నుంచి 15 వరకు అమలు చేసే సరి, బేసి నంబర్ ప్లేట్ స్కీం కోసం ప్రజా రవాణా చేసేందుకు బస్సులు కేటాయించవలసిందిగా ఢిల్లీ ప్రభుత్వ డెరైక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ నగరంలోని ప్రైవేటు స్కూళ్లను ఆదేశించింది. అలాగే ప్రైవేటు సూళ్లు తమ బస్సులను డీటీసీ వద్ద రిజిష్టర్ చేసుకోవాలని విద్యాశాఖ డెరైక్టరేట్ కోరింది. దీనిని వ్యతిరేకిస్తూ పబ్లిక్ స్కూల్స్ అసోసియేషన్.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై బుధవారం ప్రాథమిక విచారణ జరిపిన న్యాయస్థానం ఢిల్లీ సర్కారుకు నోటీసు జారీ చేసి ప్రతిస్పందన కోరింది. కేసు విచారణను వాయిదా వేసింది.