అక్కడుంటే గ్యాస్ ఛాంబర్లో ఉన్నట్లే: హైకోర్టు
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా ఉంది. దీనిపై అక్కడి హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీలో ఉంటే గ్యాస్ ఛాంబర్లో ఉన్నట్లేనని వ్యాఖ్యానించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడి వాయుకాలుష్యాన్ని తగ్గించేందుకు ఏం చేస్తున్నాయో డిసెంబర్ 21న జరిగే తదుపరి విచారణ నాటికల్లా ప్రణాళికలు ఇవ్వాలని ఆదేశించింది. ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర పర్యావరణ శాఖలు ఇచ్చిన నివేదికలు సమగ్రంగా లేవని, ఎవరు ఏం చేస్తామన్న బాధ్యతలేవీ అందులో చెప్పలేదని జస్టిస్ బదర్ దుర్రేజ్ అహ్మద్, జస్టిస్ సంజీవ్ సచ్‌దేవలతో కూడిన ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ప్రాంగణంలో ఒక ఎయిర్ ప్యూరిఫయర్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
పర్టిక్యులేట్ మేటర్ పి.ఎం. 2.5 స్థాయి ఏకంగా 60 పాయింట్లను దాటిపోయిందని, అయినా దాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఎందుకు ఏమీ చేయడం లేదని కోర్టు ప్రశ్నించింది. పి.ఎం. 2.5 అంటే 2.5 మైక్రాన్ల మందం ఉన్న కాలుష్యం. ఇది అన్నింటికంఏట అత్యంత చిన్నది, ప్రమాదకరమైనదని చెబుతారు. ఇంతకుముందు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఢిల్లీ సర్కారుకు వాయు కాలుష్యంపై తలంటింది.