odd-even scheme
-
‘సరి-బేసి’ నుంచి వారికి మినహాయింపు: సీఎం
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘సరి-బేసి’ వాహన విధానం నుంచి మహిళలకు మినహాయింపు ఇస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. నవంబర్ 4 నుంచి 15వ తేదీ వరకు చేపట్టనున్న మూడో విడత సరి-బేసి విధానంలో మహిళలకు మినహాయింపు ఇచ్చినట్లు శనివారం వెల్లడించారు. ఒంటరిగా కారును నడిపే మహిళలు, 12 ఏళ్ల చిన్నారులతోపాటు ఉన్న మహిళలు, కారులో మొత్తం మహిళలు ఉన్నా కూడా సరి-బేసి విధానం నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు. మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే గతంలో సీఎన్జీ ప్రైవేటు వాహనాలపై ఇచ్చిన మినహాయింపును తొలగిస్తున్నట్లు వెల్లడించారు. సీఎన్జీ స్టిక్కర్లతో అక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయించినట్లు తెలిపారు. ఇక ద్విచక్ర వాహనదారులకు సరి-బేసి నుంచి మినహాయింపు ఇవ్వాలా? వద్దా? అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. దీనిపై నిపుణులతో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. -
ఢిల్లీలో సరి–బేసి వాయిదా
న్యూఢిల్లీ: కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతున్న దేశ రాజధానిలో సోమవారం నుంచి ప్రారంభం కావాల్సి ఉన్న ‘సరి–బేసి’ విధానాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. మహిళలు, ద్విచక్ర వాహనాలకు ఈ విధానం నుంచి మినహాయింపు ఇవ్వటంపై జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో కేజ్రీవాల్ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. అయితే మహిళల భద్రతపై రాజీపడబోమన్న కేజ్రీ సర్కారు.. సోమవారం రివ్యూ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. ప్రభుత్వ మినహాయింపులకు ఎన్జీటీ అంగీకరించిన తర్వాత ‘సరి–బేసి’ని తిరిగి ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని ఢిల్లీ రవాణా మంత్రి కైలాశ్ గెహ్లాట్ వెల్లడించారు. ‘మహిళల భద్రతపై రాజీపడబోం. పీఎం 2.5, పీఎం 10 అనే కాలుష్య స్థాయిలూ కాస్తంత తగ్గాయి. కానీ ఎన్జీటీ నిర్ణయాలను గౌరవిస్తున్నాం. అయితే, సోమవారం మళ్లీ ఎన్జీటీలో రివ్యూ పిటిషన్ వేస్తాం’ అని గెహ్లాట్ పేర్కొన్నారు. ఎన్జీటీ ఆదేశాల తర్వాత సీఎం కేజ్రీవాల్, పలువురు మంత్రులతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అత్యవసర సర్వీసులు ఓకే.. కానీ! ఢిల్లీని కాలుష్యం కమ్మేసిన నేపథ్యంలో నవంబర్ 13 నుంచి 17 వరకు ఐదురోజుల పాటు సరి–బేసి విధానాన్ని అమలుచేయాలని తొలుత కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయించింది. తీవ్రమైన స్మాగ్ (పొగమంచు+కాలుష్యం) కారణంగా పాఠశాలలకు కూడా ఆదివారం వరకు సెలవులిచ్చింది. దీంతో సోమవారం నుంచి స్కూలు బస్సులు, ఇతర వాహనాలతో మళ్లీ కాలుష్యం పెరగొచ్చని భావించిన ప్రభుత్వం ఈ విధానాన్ని అమలుచేసేందుకు రంగం సిద్ధం చేసింది. అయితే ఇందులో మహిళల వాహనాలు, ద్విచక్ర వాహనాలతోపాటుగా అంబులెన్సు, చెత్త తీసుకెళ్లే వాహనాలు, అగ్నిమాపక యంత్రాలకు మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే ఈ మినహాయింపులపై ఎన్జీటీలో పిటిషన్ దాఖలైంది. అంబులెన్సు, చెత్త వాహనాలు, ఫైరింజన్లకు మినహాయింపును సమర్థించిన ఎన్జీటీ.. మహిళలు, ద్విచక్ర వాహనాలకు అనుమతినివ్వాలన్న ప్రతిపాదనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఢిల్లీ సర్కారు తన నిర్ణయాన్ని వాయిదా వేసింది. చలికాలంలో వాహనాల ద్వారానే పెద్దమొత్తంలో పీఎం2.5, పీఎం10లు మామూలు సమయం కన్నా 20–25 శాతం ఎక్కువగా వెలువడతాయని ఐఐటీ కాన్పూర్ గతంలో ఓ అధ్యయనంలో వెల్లడించింది. ఢిల్లీ ట్రాన్స్‌పోర్టుపై ఎన్జీటీ ఆగ్రహం ఢిల్లీ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ బస్సులను సరిగా నిర్వహించటం లేదని.. దీని కారణంగా ఈ బస్సులు పెద్ద శబ్దం చేస్తూ ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టిస్తున్నాయని ఎన్జీటీ మండిపడింది. ‘మీ బస్సులు రోడ్లపై పెద్ద శబ్దం చేస్తూ ఇబ్బందికరంగా మారుతున్నాయి. చాలావరకు బస్సుల్లో కనీసం హ్యాంగర్లు ఉండవు. బస్సులను నిర్వహించటంలో బాధ్యతగా వ్యవహరించరెందుకు?. కొన్ని సార్లు ఖాళీగా వెళ్తున్నాయి. మరికొన్ని సార్లు రద్దీగా ఉంటున్నాయి’ అని ఎన్జీటీ చైర్పర్సన్ జస్టిస్ స్వతంతర్ కుమార్ మండిపడ్డారు. తక్కువ ట్రాఫిక్ ఉన్న సమయాల్లో మినీ బస్సులు నడపాలని గతంలో ఎన్జీటీ సూచించింది. వీటిని పట్టించుకోకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రమాదకర స్థాయిలోనే కాలుష్యం దేశరాజధానిలో గాలిలో విషపదార్థాలు, కాలుష్యకారకాల స్థాయి ఇంకా ప్రమాదకరస్థితిలోనే ఉంది. వరుసగా ఐదోరోజూ అదే స్థాయిలో పొల్యూషన్ కనిపించింది. కాస్త కుదురుకుంటుందనుకున్న తరుణంలో.. శనివారం సాయంత్రం పరిస్థితుల్లో మార్పు నగరాన్ని ‘కాలుష్య అత్యవసర’ దిశగా తీసుకెళ్లింది. పీఎం 2.5, పీఎం 10 స్థాయిలు మెల్లిగా తగ్గుముఖం పడుతున్నాయని ప్రభుత్వం ప్రకటించిన కాసేపటికే.. పరిస్థితి భిన్నంగా మారింది. వేగంగా ఉష్ణోగ్రతల్లో తగ్గుదల ఏర్పడటమే ఇందుకు కారణమని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సీపీసీబీ) అధికారులు తెలిపారు. దీనివల్ల అనారోగ్య పరిస్థితులు తీవ్రమవుతాయని హెచ్చరించారు. సీపీసీబీ వెల్లడించిన వివరాల ప్రకారం శనివారం మధ్యాహ్నం వాయు నాణ్యత సూచీ 423 (మొత్తం 500) యూనిట్లుగా నమోదవగా.. పీఎం2.5 స్థాయి 422కు చేరుకుంది. ఢిల్లీ–ఎన్సీఆర్ పరిధిలో యూపీలోని ఘజియాబాద్ అత్యంత కాలుష్య ప్రదేశంగా నిలిచింది. ఇక్కడ వాయు నాణ్యత సూచీ 484 యూనిట్లుండగా.. పీఎం 2.5 స్థాయి 869 యూనిట్లకు చేరింది. సాధారణ స్థాయికన్నా ఇది 34 రెట్లు ఎక్కువ. -
బీజేపీ ఎంపీకి జరిమానా
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం అమలు చేస్తున్న సరి-బేసి ట్రాఫిక్ నిబంధనను బీజేపీ ఎంపీ విజయ్ గోయెల్ ఉద్దేశ్యపూర్వకంగా ఉల్లంఘించారు. ట్రాఫిక్ పోలీసులు ఆయనకు 2 వేల రూపాయల జరిమానాను విధించారు. ఆప్ సర్కార్ రాజకీయ ఎత్తుగడకు నిరసనగా సరి-బేసి నిబంధనను ఉల్లంఘిస్తానని సోమవారం ఉదయం విజయ్ గోయెల్ చెప్పారు. ఢిల్లీ రవాణ శాఖ మంత్రి గోపాల్ రాయ్.. ఆయనకు రోజా పూలు ఇచ్చి నిర్ణయాన్ని మార్చుకోవాల్సిందిగా కోరినా మెత్తబడలేదు. సరి-బేసి నిబంధనకు తాను వ్యతిరేకంగా కాదని, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజకీయ ప్రయోజనం కోసం అవలంభిస్తున్న వైఖరికి వ్యతిరేకమని గోయెల్ స్పష్టం చేశారు. సరి-బేసి నిబంధన ఉల్లంఘించినవారికి వేసే 2 వేల జరిమానా చాలా ఎక్కువని, దీన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. -
15తో 'సరి-బేసి'కి తెర...
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న 'సరి-బేసి' నెంబర్ ప్లేట్ విధానాన్ని ఈ నెల 15వ తేదీతో ముగిస్తామని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విధానాన్ని పొడిగించే ఆలోచన లేదని తెలిపింది. ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని నిరోధించేందుకు 'సరి-బేసి' నెంబర్ ప్లేట్ల ఆధారంగా రోజు విడిచి రోజు వాహనాలను రోడ్లకు మీదకు అనుమతించాలని కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. జనవరి 1 నుంచి ప్రయోగాత్మకంగా అమలుచేస్తున్న ఈ విధానాన్ని 15 తేదీ వరకు కొనసాగించాలని మొదట నిర్ణయించారు. 15 తర్వాత ఈ విధానంపై సమీక్ష నిర్వహిస్తామని ఢిల్లీ రవాణాశాఖ మంత్రి గోపాల్‌రాయ్ శనివారం తెలిపారు. అయితే ఈ విధానాన్ని మరింతకాలం పొడిగించే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. 15 రోజలకు మించి కూడా ఈ విధానాన్ని పొడిగించవచ్చునని కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టుకు తెలిపిన సంగతి తెలిసిందే. దీనివల్ల ఢిల్లీ వాయుకాలుష్యం తగ్గి వాతావరణ పరిస్థితులు మెరుగయ్యే అవకాశముందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ విధానాన్ని కొనసాగిస్తారా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. 'సరి-బేసి' విధానం వల్ల ఇప్పటికే 5893 మందికి చలాన్లు విధించారు. ఈ నేపథ్యంలోనే ఈ విధానం ప్రయోగాత్మక అమలును ఈ నెల 15తో చాలించాలని కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. -
వారిని ఎందుకు మినహాయించారు?
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో జనవరి 1 నుంచి 15వ తేదీ వరకు అమలుచేయనున్న సరి, బేసి నంబర్‌ప్లేట్ ఫార్ములా నుంచి ద్విచక్ర వాహనాలను, మహిళలను ఎందుకు మినహాయించారని బుధవారం ఢిల్లీ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై సర్కారు ప్రతిస్పందనను కోరుతూ న్యాయస్థానం కేసుపై విచారణను జనవరి 6 తేదీకి వాయిదా వేసింది. అలాగే తమకు కూడా సరి, బేసి ఫార్ములా నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. సరి, బేసి ఫార్ములా నుంచి మినహాయింపు కావాలని లాయర్లతో పాటు డాక్టర్లు, వ్యాపారులు కూడా కోరుతున్నారు. ప్రైవేటు స్కూళ్లకు ఊరట సరి, బేసి ప్రయోగాన్ని విజయవంతంగా అమలుచేసేందుకు ప్రభుత్వానికి బస్సులు ఇవ్వడానికి నిరాకరిస్తున్న ప్రైవేటు స్కూళ్లకు ఢిల్లీ హైకోర్టు నుంచి ఊరట లభించింది. బస్సులు ఇవ్వాల్సిందిగా స్కూళ్లపై ఒత్తిడి తేరాదని న్యాయస్థానం ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. జనవరి 1 నుంచి 15 వరకు అమలు చేసే సరి, బేసి నంబర్ ప్లేట్ స్కీం కోసం ప్రజా రవాణా చేసేందుకు బస్సులు కేటాయించవలసిందిగా ఢిల్లీ ప్రభుత్వ డెరైక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ నగరంలోని ప్రైవేటు స్కూళ్లను ఆదేశించింది. అలాగే ప్రైవేటు సూళ్లు తమ బస్సులను డీటీసీ వద్ద రిజిష్టర్ చేసుకోవాలని విద్యాశాఖ డెరైక్టరేట్ కోరింది. దీనిని వ్యతిరేకిస్తూ పబ్లిక్ స్కూల్స్ అసోసియేషన్.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై బుధవారం ప్రాథమిక విచారణ జరిపిన న్యాయస్థానం ఢిల్లీ సర్కారుకు నోటీసు జారీ చేసి ప్రతిస్పందన కోరింది. కేసు విచారణను వాయిదా వేసింది. -
మహిళలు, టూ వీలర్స్‌కు ఎగ్జెంప్షన్ ఎందుకు?
న్యూఢిల్లీ: హస్తినలో జనవరి 1 నుంచి అమలుచేయనున్న 'సరి-బేసి' ట్రాఫిక్ నిబంధనల నుంచి మహిళలు, ద్విచక్ర వాహనదారులకు ఎందుకు మినహాయింపు ఇచ్చారో చెప్పాలని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. ఈ విషయంలో ప్రభుత్వం వివరణ కోరుతూ.. తదుపరి విచారణనను జనవరి 6కు వాయిదా వేసింది. ఢిల్లీలో నెలకొన్న వాయుకాలుష్యాన్ని నియంత్రించడానికి 'సరి-బేసి' నెంబర్ ప్లేట్ల వాహన నిబంధనలను జనవరి 1 నుంచి ప్రతిష్టాత్మకంగా అమలుచేయాలని కేజ్రీవాల్ ప్రభుత్వం భావిస్తోంది. 'సరి-బేసి' నెంబర్ ప్లేట్ల ఆధారంగా దినం తప్పించి దినం వాహనాలను రోడ్లపైకి అనుమతించాలని నిర్ణయించింది. అయితే ఈ నిబంధనల నుంచి మహిళా డ్రైవర్లు, ద్విచక్ర వాహనదారులకు మినహాయింపు ఇస్తున్నట్టు సీఎం కేజ్రీవాల్ సోమవారం విలేకరులకు వెల్లడించారు. ఢిల్లీలో పెరిగిపోతున్న వాయుకాలుష్యాన్ని ఎలా నియంత్రిస్తారో చెప్పాలంటూ హస్తిన ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో కేజ్రీవాల్ సర్కార్ చైనాలోని బీజింగ్ తరహాలో 'సరి-బేసి' పథకాన్ని ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. -
ఢిల్లీ సీఎంపై సోనియా అల్లుడు ఫైర్
న్యూఢిల్లీ: ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు, ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. కాలుష్య నివారణ కోసం ఢిల్లీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'బేసి-సరి పథకం' నుంచి వీఐపీల వాహనాలకు మినహాయింపు ఇవ్వడాన్ని వాద్రా తప్పుపట్టారు. 'బేసి-సరి పథకంలో మినహాయింపు ఇవ్వడం పూర్తిగా వంచనే. ప్రజాప్రయోజనాల కోసం ఓ చట్టాన్ని అమలు చేసినపుడు మనమందరూ పాటించాలి. వీఐపీలకు మినహాయింపు ఇవ్వరాదు' అని వాద్రా తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు. ఢిల్లీ ప్రభుత్వం కాలుష్యాన్ని నివారించడం కోసం ఢిల్లీ రోడ్లపై బేసి-సరి నెంబర్లు గల వాహనాలను రోజు మార్చి రోజు అనుమతించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఎవరైనా ఈ నిబంధన ఉల్లంఘిస్తే 2 వేల రూపాయలు జరిమానా వేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే వీఐపీలకు మినహాయింపు ఇచ్చారు. ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. దీనివల్ల ఇబ్బందులు ఎదురవుతాయని వాపోయారు. -
ముఖ్యమంత్రికి, మంత్రులకూ మినహాయింపు లేదు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా అమలుచేయనున్న సరి-బేసి నెంబర్ ప్లేట్ ప్రణాళిక పరిధిలోకి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆయన మంత్రివర్గ సహచరులు రానున్నారు. 'ముఖ్యమంత్రి సహా మంత్రులందరూ ఈ ప్రణాళికలో పరిధిలోకి రానున్నారు. అయితే కేంద్రమంత్రులు కూడా దీనిని అనుసరించాలా? లేదా? అన్నది కేంద్ర ప్రభుత్వ విచక్షణాధికారానికి రాష్ట్ర ప్రభుత్వం విదిలేసే అవకాశముంది' అని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. హస్తినలో వాయు కాలుష్య నియంత్రణకు జనవరి 1 నుంచి సరి-బేసి నెంబర్ ప్లేట్ ఆధారంగా దినం తప్పించి దినం కార్లను రోడ్ల మీదకు అనుమతించాలని కేజ్రీవాల్ సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ ప్రణాళికను సామాన్యులతోపాటు వీఐపీలకూ వర్తింపజేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం భావిస్తున్నది. ఈ ప్రణాళికకు సంబంధించిన సమగ్ర నివేదిక పూర్తయిన తర్వాత సూచనలు, సలహాల కోసం దీనిని కేంద్ర ప్రభుత్వానికి పంపే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి.