ఓలా డ్రైవర్‌ను పట్టించిన మహిళ ఫోన్
మంచి మాటలు చెబుతూ మహిళను కిడ్నాప్ చేసి, ఆపై అత్యాచారయత్నం చేసినందుకు ఓలా క్యాబ్ డ్రైవర్‌ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఆమె నుంచి లాక్కున్న ఫోనే అతడిని పోలీసులకు పట్టించింది. షాదాబ్ మహ్మద్ ఇబ్రహీం షేక్ అనే నిందితుడు ఘట్కోపర్ ప్రాంతానికి చెందినవాడు. బాధితురాలు గృహిణి. తన ఏడేళ్ల కొడుకును స్కూలు నుంచి తీసుకొచ్చేందుకు ఆమె వెళ్తుండగా.. షేక్ ఆమెను పిలిచి తన క్యాబ్ ఎక్కించుకున్నాడని పోలీసులు తెలిపారు. తాను బేబీ సిట్టర్ కోసం చూస్తున్నానని చెప్పడంతో ఆమె క్యాబ్ ఎక్కేందుకు అంగీకరించారన్నారు. ముందుసీట్లో ఆమె కూర్చోగానే కారు డోర్లన్నీ లాక్ చేయడంతో పాటు అద్దాలు కూడా పైకి ఎత్తేశాడు. తనతో స్నేహంగా ఉండాలని, మొబైల్ నెంబరు ఇవ్వాలని ఆమెను బలవంతపెట్టాడు. చివరకు ఆమె ఫోన్ కూడా లాగేసుకున్నాడు. అతడితో స్నేహం చేయడానికి ఆమె నిరాకరించడంతో అతడు కారు స్టార్ట్ చేసి వేగంగా ముందుకు పోనిచ్చాడు. ఆమె గట్టిగా అరిచినా, అద్దాలు వేసి ఉండటంతో ఎవరికీ వినిపించలేదు.
కారు స్టీరింగ్ పట్టుకుని పక్కకు తిప్పేందుకు ఆమె ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఎలాగోలా కారు తలుపును ఆమె తెరవగలిగారు. బయటకు దూకేందుకు ప్రయత్నించడంతో భయపడిన షేక్.. కారు ఆపాడు. వెంటనే ఆమె కిందకు దిగి, తన ఫోన్ తిరిగి ఇవ్వాలని అడిగారు. అతడు నిరాకరించగా.. అక్కడి నుంచి వెళ్లిపోయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫోనే క్యాబ్ డ్రైవర్‌ను పట్టించింది. షేక్ ఆ ఫోనును తన భార్యకు ఇవ్వగా.. కొడుకు వైద్య ఖర్చుల కోసం ఆమె ఆ ఫోనును రూ. 500కు అమ్మేసింది. కొన్న వ్యక్తి ఆ ఫోన్ స్విచాన్ చేయగానే పోలీసులు దాన్ని ట్రాక్ చేసి.. అక్కడకు వెళ్లారు. ఫోను కొన్న వ్యక్తి షేక్ ఇల్లు చూపించడంతో పోలీసుల పని సులభమైంది. ఓలా క్యాబ్ డ్రైవర్ షేక్‌పై పోలీసులు ఐపీసీ 354, 365, 392, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.