కాల్ డేటా మొత్తం డిలీట్ చేశాడు
న్యూఢిల్లీ: ఢిల్లీలో బెల్జియన్ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఓలా క్యాబ్ డ్రైవర్ కేసు ఘటన గురించి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ వాకబు చేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నుంచి ఈ కేసుకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. బెల్జియానికి చెందిన 23 ఏళ్ల మహిళపై ఓలా క్యాబ్ డ్రైవర్ లైంగిక వేధింపులకు పాల్పడిన విషయం తెలిసిందే. దక్షిణ ఢిల్లీలోని సీఆర్ పార్క్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
జీపీఎస్ వ్యవస్థ పనిచేయడం లేదని, వచ్చి ముందుకూర్చుని రూట్ చూపించాలని కోరి, ఆమె ముందు కూర్చున్న తర్వాత లైంగికంగా, అసభ్యకరంగా తాకడం ప్రారంభించాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడు రాజస్థాన్ లోని అల్వార్ ప్రాంతానికి చెందినవాడిగా గుర్తించిన పోలీసులు అరెస్టు చేశారు.
కాగా, అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఈ డ్రైవర్ కాల్ డేటా ఫోన్ లో నుంచి తొలగించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల ఫోన్ కాల్స్ తోపాటు.. ఇతర ఫోన్ కాల్స్ వివరాలు, సందేశాలు డిలేట్ చేసినట్లు తెలిసింది. అరెస్టు నుంచి బయటపడొచ్చన్న ఉద్దేశంతోనే అతడు ఆ పనిచేసినట్లు తెలిసింది.