మహిళా జడ్జిపై వేధింపులు.. ఓలా డ్రైవర్ అరెస్టు
దేశ రాజధాని నగరంలో మహిళా జడ్జిని వేధించి, ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించిన కేసులో ఓలా క్యాబ్ డ్రైవర్‌ను అరెస్టు చేశారు. తీస్ హజారీ కోర్టులో అదనపు సెషన్స్ జడ్జిగా వ్యవహరిస్తున్న ఆమె ఫిర్యాదు మేరకు సందీప్ అనే ఆ డ్రైవర్‌ను గుర్‌గావ్ ప్రాంతంలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మే 28వ తేదీన తాను ఉత్తర ఢిల్లీలోని ఓ మార్కెట్‌లో షాపింగ్ చేసేందుకు ఓలా క్యాబ్ బుక్ చేసుకున్నానని, షాపులోకి వెళ్తూ కాసేపు వేచి చూడాలని తాను డ్రైవర్‌ను కోరానని, అయితే రెండు నిమిషాలు గడిచాయో లేదో, ఆ డ్రైవర్ తనను నోటికి వచ్చినట్లు అసభ్యంగా తిట్టడం మొదలుపెట్టాడని మహిళా జడ్జి చెప్పారు. ఆమె బ్యాగ్‌ను రోడ్డుమీద పారేశాడు.
దాంతో ఓలా క్యాబ్ డ్రైవర్‌పై ఆమె బుధవారం నాడు పోలీసులకు ఫిర్యాదుచేశారు. దాంతో ఐపీసీ సెక్షన్లు 354 ఎ (మహిళలపై లైంగిక వ్యాఖ్యలు చేయడం), 509 (మహిళ ఆత్మగౌరవానికి భంగం కలిగేలా మాట్లాడటం లేదా ప్రవర్తించడం), 427 (మోసం చేయడం) కింద రూప్ నగర్ పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టి, డ్రైవర్‌ను అరెస్టు చేశారు.