నేపాల్ సంక్షోభం.. భారత్ కు మంచిదే!
న్యూఢిల్లీ: నేపాల్ ప్రధానమంత్రి పదవికి కేపీ శర్మ ఓలీ ఆదివారం రాజీనామా చేశారు. విశ్వాసపరీక్షకు ఒక రోజు ముందు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మావోయిస్టు నేపాలీ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రచండ కఠ్మాండు పీఠాన్ని దక్కించుకోనున్నారు. ఓలీ నేతృత్వంలోని నేపాల్ ప్రభుత్వం విదేశీ వ్యవహారాలను చైనాకు అనుకూలంగా తీసుకుంటుండగా, ఓలీ పదవికి రాజీనామా చేయడం భారతదేశానికి ఒకరకంగా శుభవార్తే.
నేపాల్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 305ను అనుసరించి అధ్యక్షురాలు భండారీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. నేపాల్ కాంగ్రెస్ లీడర్, మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా కేవలం పార్లమెంటుకు మాత్రమే కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం ఉందని అన్నారు. 287 రోజుల పాటు నేపాల్ ప్రధాన మంత్రిగా పనిచేసిన కేపీ శర్మ ఓలీ చర్యలు దేశానికి హాని చేసేలా ఉన్నాయంటూ తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అది ఎంతలా మారిందంటే కనీసం కేర్ టేకర్ గా ఉంటానని అధ్యక్షురాలిని ఓలీ కోరినా ససేమీరా అనేంతలా. దీంతో గత్యంతరం లేని ఓలీ కొత్త ప్రధానిని ఎన్నుకునేందుకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ఓలీపై వ్యతిరేకతకు కారణాలు ఇవీ...
1. నేపాల్ లో అత్యధిక సంఖ్యలో ఉన్న మాధేశీలపై వివక్షను చూపడం. దీంతో మాధేశీలు కొన్ని నెలలపాటు ఓలీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు. భారత్-నేపాల్ బోర్డర్లో పెద్ద స్థాయిలో ఉద్యమాలు సాగాయి.
2. 2015లో నేపాల్ లో సంభవించిన భారీ భూకంపం తర్వాత నిర్వాసితులకు రక్షణ కల్పించడంలో ఓలీ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైంది.
3. భారత్ తో స్నేహపూర్వక వాతావరణాన్ని తప్పించి చైనాతో స్నేహం చేస్తూ యాంటీ-ఇండియన్ స్టేట్ డెవలప్ చేయడానికి ఓలీ ప్రయత్నం చేశారు.
4. నేపాల్ రాజ్యాంగంలోని లోపాలను సవరించకుండా ఉంచడంతో, తెరాయ్ రీజయన్ల నుంచి ప్రమాదం ఉంటుందన్న భావనతో 2015లో నేపాల్-భారత్ బోర్డర్లో ఇండియా కఠినంగా వ్యవహరించింది. భారత ప్రధాని 'సమావేశీ సంవిధాన్' ద్వారా నేపాలీ నాయకత్వాన్ని సంప్రదించినా ఉపయోగం లేకుండా పోయింది. అంతేకాకుండా నేపాల్ తో భారత్ సంబంధాలను పలువిధాలుగా మార్చి చూపారు.
నేపాల్ లో ప్రభుత్వాన్ని కొనసాగించేందుకు చైనా మావోయిస్టు పార్టీలను సంప్రదించింది. లెఫ్ట్ పార్టీలను అన్నింటినీ ఒక్కటి చేయాలని చూసిన చైనా పన్నాగం పారలేదు. ప్రచండను ఒప్పించగలిగిన చైనా, నేపాల్ ప్రజల నుంచి ప్రచండకు వచ్చిన ఫీడ్ బ్యాక్ ను మాత్రం ఏమీ చేయలేకపోయింది. ప్రజల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ వేరేలా ఉంటుండటంతో చైనాకు దన్నుగా నిలవలేమని ప్రచండ చెప్పేశారు. దాంతో ఓలీ ప్రభుత్వం కూలిపోయింది. యాంటీ ఇండియా సెంటిమెంటును భారత్ చుట్టుపక్కల ఉన్నదేశాలకు ఎక్కించేందుకు చైనా చేసిన ప్రయత్నానికి తెరపడింది. చైనా చేయాలనుకున్న పనే దానికి రివర్స్ అయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. నేపాల్ లో ఏర్పడనున్న కొత్త ప్రభుత్వానికి భారత్ తన పూర్తి మద్దతును అందించనుంది.