ఊరంతా లాటరీ కొట్టింది
స్పెయిన్‌లో 1812 నుంచి జాతీయ లాటరీ ‘ఎల్ గోర్డో’ నడుస్తోంది. డిసెంబరు 22న దీనికి డ్రా తీస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద లాటరీగా ఇది పేరుపడింది. ఈసారి 3.2 కోట్ల మంది స్పెయిన్‌వాసులు లాటరీ టిక్కెట్లు కొన్నారు. లాటరీ నెంబర్లను ఆడేవారు ఎంచుకోవడం ఉండదు. ముందుగానే ఐదెంకల నెంబర్లను టిక్కెట్లపై ముద్రించి అమ్ముతారు. తర్వాత స్కూలు పిల్లలతో డ్రా తీయిస్తారు. ఈసారి ఈ లాటరీ ఓ ఊరి తలరాతనే మార్చేసింది. తీర ప్రాంత పట్టణమైన రొక్క్వెటాస్ డి మార్ అనే చిన్న పట్టణంలో ఏకంగా 1,600 మంది రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోయారు. 79140 నెంబరుగల టిక్కెట్టుకు లాటరీ తగిలింది.
ఫలితాలు చూసుకున్న ఈ ఊరివాసుల్లో ఆనందానికి అవధుల్లేవు. ఎందరో రోడ్లపైకి వచ్చి సెలబ్రేట్ చేసుకున్నారు. అధికారికంగా లెక్కతేల్చి చూడగా... ఏకంగా 1,600 మందికి తలా ఒకరికి మూడు కోట్ల రూపాయలు వచ్చాయి. పైగా ఈ టిక్కెట్లన్నీ ఒకే షాపులో కొన్నవి కావడం విశేషం. ఎక్కువగా మధ్యతరగతి, శ్రామికులు నివసించే ఈ పట్టణంలో అవసరాల్లో ఉన్నవారికే డబ్బు దక్కిందని స్పెయిన్‌వాసులు సంతృప్తి వెలిబుచ్చుతున్నారు.