
ఐరాస భద్రతా మండలిలో ఒక్కరే మహిళ
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితిలో మహిళా దౌత్యవేత్తల సంఖ్య చాలా తక్కువగా ఉంది. గత 70 ఏళ్ల కాలంలో అతి కొద్దిమంది మాత్రమే భద్రతా మండలిలో చోటు దక్కించుకోగలిగారు. 2014లో రికార్డు స్థాయిలో ఆరుగురు ఉండగా.. 2015కి వచ్చే సరికి ఈ సంఖ్య నాలుగుకు తగ్గింది. 15 మంది సభ్యుల భద్రతా మండలిలో ప్రస్తుతం ఒక్క మహిళ మాత్రమే ఉన్నారు. అమెరికా రాయబారి సమంతా పవర్ ఒక్కరే ఇప్పుడు సెక్యూరిటీ కౌన్సిల్‌లో ఉన్నారు. యూఎన్ కమిషన్ ఆన్ ద స్టాటస్ ఆఫ్ వుమెన్‌కు సంబంధించి జరుగుతున్న వార్షిక సమావేశం కోసం వేలాది మంది మహిళలు ఈ వారం ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా సమంతా పవర్‌తో పాటు భద్రతా మండలిలో రాయబారులుగా పని చేసిన నలుగురు మహిళలు స్పందిస్తూ.. పురుషాధిత్యత ఎక్కువగా ఉన్న భద్రతా మండలిలో మరింత మంది మహిళలకు చోటు కల్పించాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ శాంతి, భద్రత వంటి కీలక అంశాలను మహిళలకు అప్పగించాలని కోరారు.