బిపిన్ రావత్, సంజయ్ ఝా
ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలపై మండిపడ్డ విపక్షాలు
న్యూఢిల్లీ: కశ్మీర్‌లో డర్టీ వార్ కొనసాగుతోందని, ఈ యుద్ధంలో వినూత్న పద్ధతుల్లో పోరాడాలని భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడ్డాయి. ఆయన దేశ అంతర్గత భద్రతపై రాజకీయ వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సూచించాయి.
సీపీఐ నేత డి.రాజా మాట్లాడుతూ.. ఆర్మీ చీఫ్ రాజకీయ వివాదాలకు కేంద్రం కావడం దురదృష్టకరమన్నారు. కశ్మీర్ సమస్యను పరిష్కరించాల్సింది సైన్యం కాదని, రాజకీయ నాయకత్వమని తేల్చిచెప్పారు.
రావత్ వాడుతున్న భాష తాను చిన్నప్పటి నుంచి వింటున్న భారత సైన్యానిది కాదని సీపీఐ(ఎం) నేత మహ్మద్ సలీం విమర్శించారు. రావత్ మాటలు వింటే ఆయన మానసిక స్థితిపై అనుమానం కలుగుతోందని వ్యాఖ్యనించారు.
రావత్ రాజకీయ వ్యాఖ్యల్ని చేయడం మానుకోవాలని జనతాదళ్ యునైటెడ్ నాయకుడు కె.సి.త్యాగీ తెలిపారు. వేర్పాటువాద సంస్థ హురియత్‌తో కాకపోయినా సాధారణ కశ్మీరీలతో సైన్యం సత్సంబంధాలను ఏర్పాటు చేసుకోవాలని త్యాగీ సూచించారు.
కశ్మీర్ సమస్యను కేవలం శాంతి భద్రతల కోణంలో మాత్రమే చూడలేమని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ ఝా స్పష్టం చేశారు. నిరంతరం చర్చలు జరపడంతో పాటు కశ్మీరీ యువత పట్ల మానవత్వంతో వ్యవహరించాల్సి ఉందని తెలిపారు. కశ్మీరీ యువత భద్రతా బలగాలపై రాళ్లు విసరడమన్నది చాలా తీవ్రమైన సమస్యని ఝా అభిప్రాయపడ్డారు.
మరోవైపు రావత్ వ్యాఖ్యల్ని కేంద్ర పట్టాణాభివృద్ధి మంత్రి వెంకయ్య నాయుడు సమర్థించారు. ‘కశ్మీర్‌లో పరిస్థితులకు అనుగుణంగా ఎలాంటి చర్యనైనా తీసుకుంటామని రావత్ చెప్పారు. నేను దాన్నే సమర్థిస్తున్నాను’ అని వెంకయ్య ట్విటర్‌లో తెలిపారు.