ముస్లింలు నిష్టగా దీక్షలు, భక్తితో ప్రార్థనలు, హృదయంతో దానాలు చేసే పవిత్ర రంజాన్ మాసం రక్తసిక్తంగా మారింది. ఖలీఫా(మతరాజ్యం) స్థాపన పేరుతో హింసోన్మాదాన్ని నానాటికీ విస్తరింపజేస్తోన్న ఉగ్రవాద సంస్థ ఐసిస్.. ఈ ఏడాది రంజాన్ మాసంలో ప్రపంచ వ్యాప్తంగా 800 మందిని అతి దారుణంగా చంపేసింది. భూగోళంలోని దాదాపు అన్ని దేశాల్లో ఐసిస్ నరమేధం కొనసాగుతోంది. ఐసిస్ మూలాలున్న ఆసియా నుంచి ఐరోపా వరకు.. అమెరికా నుంచి ఆఫ్రికా వరకు ఉగ్రవాదులు పేట్రేగిపోతున్నారు. ముస్లింలు సామూహిక ప్రార్థనలు చేసుకునే రంజాన్ మాసంలో బీభత్సం సృష్టించడం ఐసిస్ లాంటి ఉగ్ర సంస్థలకు కొత్తకాకపోయినా ఈ ఏడాది మారణహోమంలో బలైన అమాయకుల సంఖ్య భారీగా ఉండటం విషాదం.
ముస్లింలోనే సున్నీ వర్గానికి చెందిన సాయుధులు ఏర్పాటుచేసిన ఐసిస్.. తమ మత భావనలను వ్యతిరేకించే షియాలపై ఎడతెగని దాడులు చేస్తోంది. ఒక్క షియాలేకాక ముస్లింలలోని ఇతర వర్గాలు, ఇతర మతస్తులను సైతం కర్కషంగా చంపేస్తోంది. దాడులకు మిగతా సమయంలో కంటే రంజాన్ మాసమే అనువైనదని ఐసిస్ భావిస్తోంది. ఎందుకంటే సాధారణ దినాల్లోకంటే పవిత్రమాసంలో ప్రతి ముస్లిం విధిగా మసీదుకు వెళతాడు. అలా గుంపుగా చేసిన జనాన్ని చంపడం ద్వారా ఐసిస్ తన లక్ష్యాన్ని సులువుగా నెరవేర్చుకుంటుంది. రంజాన్ మాసంలోని నాలుగు వారాల్లో ప్రత్యేక ఆపరేషన్లు చేపట్టిన ఐఎస్.. అమెరికా, ఫిలిప్పీన్స్, యెమెన్, జోర్డాన్, ఇరాక్, లెబనాన్, బంగ్లాదేశ, టర్కీలతో పాటు ఇన్నాళ్లూ మిత్రదేశంగా ఉన్న సౌదీ అరేబియాపై సైతం దాడులు చేసి మొత్తం 800 మందిని అమాయకులను పొట్టనపెట్టుకుంది. రంజాన్ పండుగకు మరో 48 గంటలు సమయం ఉండటంతో ఈ లోపు ఐసిస్ మరింత బీభత్సం సృష్టించే అవకాశం లేకపోలేదు.
హైదరాబాద్ లో ఐసిస్ మాడ్యూల్ ను గుర్తించి, భారీ కుట్రను ముందుగానే భగ్నం చేసిన పోలీసులు.. రంజాన్ పర్వదిన వేడుకలు ముగిసేంతవరకు అప్రమత్తతను ప్రకటించిన సంగతి తెలిసిందే. అటు మిగతా దేశాలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కొత్త తరహా దాడులతో ఐసిస్ రెచ్చిపోతూనేఉంది. ఈ ఏడాది రంజాన్ మాసం జూన్ 7న ప్రారంభమైంది. అదేరోజు ఇరాక్ లోని మౌసూల్ పట్టణంలోగల ఓ మసీదుపై ఐసిస్ ఉగ్రవాదులు దాడిచేసి 65 మంది షియాలను పొట్టనపెట్టుకున్నారు. వారం తర్వాత, అంటే జూన్ 14న అమెరికాలోని ఓర్లాండో నైట్ క్లబ్ లో ఐసిస్ ఉగ్రవాది మతీన్ 50 మందిని దారుణంగా కాల్చిచంపాడు. జులై 1న బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఓ రెస్టారెంట్ లోకి చొరబడ్డ ఉగ్రవాదులు ఒక భారతీయురాలు సహా 20 మందిని చంపేశారు. ఇది జరిగిన కొద్ది గంటలకే బాగ్ధాద్ నగరంలోని షాపింగ్ సెంటర్ లో చోటుచేసుకున్న పేలుళ్లలో 200 మంది మృత్యువాతపడ్డారు. అమెరికా స్వాతంత్ర్య దినోత్సవానికి వ్యతిరేకంగా జెడ్డాలోని అమెరికన్ కాన్సులేట్ పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తిరిగి జులై 4న ముస్లింల రెండో అతిపెద్ద పవిత్ర క్షేత్రం మదీనాలో ఉగ్రదాడి జరిగింది. ఆత్మాహుతి దాడి కారు పార్కింగ్ ప్రదేశంలో జరిగిందికాబట్టి ప్రాణనష్టం తక్కువైంది. అదే జనసమ్మర్థ ప్రదేశంలో జరిగి ఉండేదుంటే ఘోరం ఊహించని విధంగా ఉండేది. ఇవి కాక ఇరాక్, సిరియాల్లో ఐసిస్ దాదాపు 400 మందిని పొట్టనపెట్టుకున్నట్లు పలు వార్తా సంస్థలు వెల్లడించాయి. ప్రపంచమంతా ఒక్కటై ఐసిస్ ను నిరోధించకుంటే భవిష్యత్ లో 'రంజాన్ మాసపు సామూహిక ప్రార్థనలు' అని చదువుకోవాల్సి వస్తుందేమో!