ఆ నలుగురు ఉగ్రవాదులకు మరణశిక్ష
Published Mon, Dec 5 2016 8:00 PM | Last Updated on Mon, Sep 4 2017 9:59 PM
పాకిస్తాన్ కొత్త ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావెద్ బజ్వా సోమవారం కీలక ప్రకటన చేశారు. కరుడుగట్టిన నలుగురు తీవ్రవాదులకు మరణ శిక్ష వేసినట్టు ఆయన ధృవీకరించారు. తమ దేశ పౌరులపై, భద్రతా దళాలపై వారు అతి క్రూరమైన దాడులకు పాల్పడినట్టు వెల్లడించారు. ఆర్మీ కమాండ్గా ఆయన బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన వెలువరించిన కీలక ప్రకటన ఇదే. అత్తూర్ రెహ్మమాన్, మహమ్మద్ సబీర్, ఫరూక్ భట్టీ, గుల్ జరీన్లను నేరస్తులుగా గుర్తించి, ఈ శిక్ష విధించినట్టు తెలిపారు. ఈ నలుగురు 2014 డిసెంబర్ 16న పెషావర్ పాఠశాలపై దాడికి పాల్పడి, ఉరితీయబడ్డ మిలటెంట్ గ్రూపులకు చెందినవారని పేర్కొన్నారు.
కాగ, పెషావర్ స్కూల్పై జరిగిన ఉగ్రవాదుల దాడిలో 150 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం ఆ దాడిలో నేరస్తులుగా ఉన్న నలుగురికి ఆ దేశం ఉరిశిక్ష వేసింది. ప్రస్తుతం మరణ శిక్ష పడిన ఈ నలుగురు కరుడుగట్టిన ఉగ్రవాదులని, తమ దేశ పౌరులను, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ అధికారులను, ఎయిర్పోర్టు సెక్యురిటీ ఫోర్స్లను అతిక్రూరంగా చంపడంలో వీరి ప్రమేయముందని ఆర్మీ చీఫ్ పేర్కొన్నారు. వారి దగ్గరున్న ఆయుధాలను, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించారు. జనరల్ బజ్వా పాకిస్తాన్ కొత్త ఆర్మీ చీఫ్గా నవంబర్ 29నే ఆయన బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement