మేం చైనాకు ఎంతగానో రుణపడ్డాం!
రావాల్పిండి: అన్ని కాలాల్లోనూ చైనా తమ దేశానికి నిస్సంకోచంగా మద్దతునిస్తున్నదని పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా పేర్కొన్నారు. ఇలా అండగా నిలిచినందుకు ఆ దేశానికి ఎంతో రుణపడి ఉన్నామని ఆయన కృతజ్ఞతలు తెలిపారు. చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ) 90వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రావాల్పిండిలో మంగళవారం చైనా ఎంబసీ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసగించారు. చైనాతో బలమైన సోదర అనుంబంధం ఉండటం గొప్ప గౌరవంగా భావిస్తున్న బజ్వా పేర్కొన్నారు. పాకిస్థాన్, చైనాలు ఈ ప్రాంతంలో అత్యంత కీలకమైన వ్యూహకర్తలని అభివర్ణించారు. కశ్మీర్ మొదలు అనేక అంశాల్లో అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్‌కు చైనా సంపూర్ణ మద్దతు అందిస్తున్నదని చెప్పుకొచ్చారు.
అణు సరఫరాదారుల బృందం (ఎన్‌ఎస్‌జీ)లో భారత్‌కు స్వభత్వం లభించకుండా చైనా మోకాలడ్డిన సంగతి తెలిసిందే. అదేవిధంగా పాక్‌లో తలదాచుకుంటున్న జేషే మహమ్మద్ ఉగ్రవాది మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలంటూ భారత్ ఐరాసలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సైతం చైనా అడ్డుకుంది. ఇటీవల సిక్కిం సెక్టర్‌లో భారత్-చైనా సైన్యాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనా-పాక్ దోస్తీ మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.