
ఖందిల్ కేసులో పాకిస్థాన్ అనూహ్య నిర్ణయం!
ముల్తాన్: సంప్రదాయ ముస్లిం దేశమైన పాకిస్థాన్.. సోషల్ మీడియా సెలబ్రిటీ కందిల్ బలోచ్ హత్యకేసులో అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఖందిల్‌ను కిరాతకంగా చంపిన ఆమె సోదరుడిని కుటుంబం క్షమించకుండా ఉండేలా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మతఛాందసవాదుల నిషేధాజ్ఞలను బేఖాతరు చేస్తూ సోషల్ మీడియాలో నిత్యం ఫొటోలు, వీడియోలు పెడుతూ.. సంచలనం సృష్టించిన ఖందిల్ బలోచ్‌ను ఆమె సోదరుడు మహమ్మద్ వసీం మత్తుమందు ఇచ్చి.. గొంతునులిమి కిరాతకంగా చంపేశాడు.
ఖందిల్‌ను చంపినందుకు తనకు ఎలాంటి విచారం లేదని, కుటుంబం పరువు తీస్తున్నదనే ఆమెను చంపాశానని, ఇందుకు గర్వపడుతున్నానని వసీం మీడియా ముందు, కోర్టులో అంగీకరించాడు. ప్రముఖ ఇస్లాం మతగురువు అద్బుల్ ఖవి ఒడిలో కూర్చొని తన సోదరి ఆయనను ఇరకాటంలో పడేసిందని, ఇలాంటి పనులు చేస్తుండటం వల్లే చంపానని అతడు చెప్పుకొచ్చాడు.
పాకిస్థాన్‌లో సంచలనం సృష్టించిన ఈ హత్యకేసులో దేశంలో అతిపెద్ద ప్రావిన్స్ అయిన పంజాబ్ అత్యంత అరుదైన నిర్ణయం తీసుకుంది. సాధారణంగా పరువు హత్య కేసుల్లో కుటుంబం క్షమాపణ ఇస్తే.. దోషులు కోర్టు శిక్షపడకుండా తప్పించుకోవచ్చు. చట్టంలోని ఈ లొసుగులను దృష్టిలో పెట్టుకొని పరువు హత్యలు చేస్తున్న పలువురు తప్పించుకుంటున్నారు. కందిల్ బలోచ్ హత్యకేసులో ఆమె సోదరుడి ఈ లొసుగును ఉపయోగించుకొని కేసు నుంచి బయటపడకుండా ఉండేందుకు వీలుగా పంజాబ్ పోలీసు అధికారులు కీలక చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా నిందితుడికి ఖందిల్ కుటుంబం ఎట్టిపరిస్థితుల్లో క్షమాపణలు చెప్పకూడదని పోలీసులు అధికారులు ఆదేశాలు ఇచ్చారు.