బస్సులో బాంబు పేలుడు : 11 మంది మృతి
క్వెట్టా : పాకిస్థాన్ బెలూచిస్థాన్లోని ప్రావెన్స్లో సోమవారం అర్థరాత్రి దారుణం చోటు చేసుకుంది. క్వెట్టాలోని సర్యబ్ రహదారి వద్ద బస్టాండ్లోని అప్పుడే కదులుతున్న బస్సులో శక్తిమంతమైన బాంబు పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 11 మంది ప్రయాణీకులు అక్కడికక్కడే మరణించారు. మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు.
మృతుల్లో చాలా మంది దినసరి కూలీలేనని బెలూచిస్థాన్ ప్రావెన్స్ పోలీసు ఉన్నతాధికారి అల్మీష్ ఖాన్ మంగళవారం వెల్లడించారు. నగరంలో దినసరి కూలీ పనులు చేసుకునే వారిని... వారివారి స్వస్థలాలకు తీసుకు వెళ్లేందుకు ప్రతిరోజు రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత ఓ బస్సు ఉంటుందని తెలిపారు.
ఆ క్రమంలో వారిని తీసుకువెళ్లేందుకు అప్పుడే బయలుదేరిన బస్సులో కూలీలు ఉన్నారని చెప్పారు. బస్సుపై భాగంలో బాంబు అమర్చారని చెప్పారు. క్షతగాత్రుల్లో ఇద్దరు చిన్నారులు. ఎనిమిది మంది ప్రయాణీకుల పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ బాంబు పేలుడును బెలూచిస్థాన్ ముఖ్యమంత్రి తీవ్రంగా ఖండించారు.