
పాకిస్థాన్ పాఠాలు నేర్వలేదు: పారికర్
బెంగళూరు: సరిహద్దులో కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాకిస్థాన్ పదేపదే పాల్పడుతుండడంపై రక్షణ మంత్రి మనోహర్ పారికర్ స్పందించారు. పాకిస్థాన్ ఇప్పటికీ పాఠాలు నేర్చుకోలేదని విమర్శించారు. కొత్త సంవత్సరం ప్రారంభం రోజున కూడా పాకిస్థాన్ తెంపరితనం ప్రదర్శించిందని మండిపడ్డారు. గురువారం ఆయన బెంగళూరులో విలేకరులతో మాట్లాడారు.
'ఇస్లామాబావ్ పాఠాలు నేర్చుకున్నట్టు కనబడలేదు. పాకిస్థాన్ కవ్వింపులకు మనదేశం దీటైన సమాధానం ఇచ్చింది. కొత్త ఏడాది ఆరంభం రోజున కూడా పాక్ కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంది. అర్థరాత్రి 12.30 గంటల ప్రాంతంలో కాల్పులకు తెగబడింది. దీనిబట్టి చూస్తే పాకిస్థాన్ ఇంకా పాఠాలు నేర్వనట్టే కనబడుతోంది' అని పారికర్ వ్యాఖ్యానించారు.