దెబ్బకు కాళ్ల బేరానికి వచ్చిన పాక్!
సరిహద్దుల్లో కాల్పులతో పేట్రేగుతున్న పాకిస్థాన్ సైన్యం.. తాజాగా చర్చలకు దిగివచ్చిన సంగతి తెలిసిందే. సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వద్ద అనుమానిత ఉగ్రవాదులు ముగ్గురు భారతీయ సైనికులను పొట్టనబెట్టుకున్నారు. అంతేకాకుండా ఒక సైనికుడి శరీరాన్ని ముక్కలుగా నరికేశారు. దీంతో రగిలిపోయిన భారత సైన్యం దీటుగా బదులిచ్చింది. మరింత దీటుగా పాక్ సైన్యానికి జవాబు చెప్తామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పాక్ అధికారులు భారత బలగాల షెల్లింగ్ దాడుల్లో 11మంది పౌరులు, ముగ్గురు సైనికులు బుధవారం చనిపోయినట్టు ప్రకటించారు.
అంతేకాకుండా బుధవారం సాయంత్రం పాక్ విజ్ఞప్తి మేరకు మిలటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరళ్లు హాట్‌లైన్‌లో చర్చించి.. కాల్పుల విరమణ పాటించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో రక్షణమంత్రి మనోహర్ పరీకర్ స్పందిస్తూ.. సరిహద్దుల్లో ‘పిరికిపంద’ దాడులను భారత్ దీటుగా తిప్పికొడుతుండటంతో దాయాది పాకిస్థాన్ కాళ్ల బేరానికి వచ్చిందని, దాడులను ఆపాలని భారత్‌ను విజ్ఞప్తి చేసిందని పేర్కొన్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న గోవాలోని ఓ సభలో ప్రసంగించిన పరీకర్.. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా దేశ నాయకత్వం బలమైన విధాన నిర్ణయాలు తీసుకుంటున్నదని కొనియాడారు.
‘మన సైన్యం వీరోచితమైనదనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. కానీ తొలిసారి దేశ రాజకీయ నాయకత్వం కూడా బలమైన విధాన నిర్ణయాలు తీసుకుంటున్నది. అంతేకాకుండా పరికిపందల దాడులకు మేం దీటుగా బదులిస్తున్నాం. కొన్నిరోజులుగా ఇలా బలంగా ప్రతిస్పందిస్తుండటంతో వాళ్లు దిగొచ్చి ‘దయచేసి ఆపండి. మేం మీకు విజ్ఞప్తి చేస్తున్నాం’ అంటూ వేడుకుంటున్నారు. దీనిని ఆపడానికి మాకేం అభ్యంతరం లేదు. కానీ మీరు కూడా ఆపాలి. అప్పుడే సరిహద్దుల్లో కాల్పులు ఉండవు’ అని పరీకర్ వ్యాఖ్యానించారు.