నిన్న అనామకుడు.. నేడు సెలబ్రిటీ!
లాహోర్: మొన్నటి వరకు అతనో సాధారణ జర్నలిస్టు. కరాచి ఇండస్ న్యూస్ చానెల్‌లో పనిచేసే చిరుద్యోగి. అప్పుడప్పుడు అసైన్‌మెంట్ ఫోన్లు తప్పించి పెద్దగా ఫోన్లు కూడా వచ్చేవి కావు. జర్నలిస్టు మిత్రులకు మాత్రం అతనో లాఫింగ్ స్టఫ్. ఇప్పుడతను ఓ పెద్ద సెలబ్రిటీ. క్షణం విరామం లేకుండా అతని ఫోను మోగుతూనే ఉంటుంది. జాతీయ, అంతర్జాతీయ టీవీలు, వార్తా పత్రికలు, రేడియో స్టేషన్లు ఆయన ఇంటర్వ్యూల కోసం పోటీ పడుతున్నాయి.
ఇప్పటికే పాకిస్తాన్ టీవీ, గల్ఫ్ న్యూస్, డాన్, హిందుస్థాన్ పత్రికలు, ఇంటర్నేషనల్ న్యూస్ వైర్ సర్వీస్, రేడియో మిర్చి లాంటి ఎఫ్‌ఎమ్ రేడియోలు ఇంటర్వ్యూలు చేయగా, మరిన్ని అతని ఇంటర్వ్యూల కోసం క్యూలో ఉన్నాయి. బాలీవుడ్ సినిమాల్లో నటించాల్సిందిగా ఆఫర్లు కూడా వస్తున్నాయట. అతనే చాంద్ నవాబ్. పాకిస్తాన్ జర్నలిస్ట్.
బాక్సాఫీస్ వద్ద బంపర్ కలెక్షన్లు వసూలు చేస్తూ ఇటు ప్రేక్షకులు, అటు విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న సల్మాన్ ఖాన్ నటించిన చిత్రం ‘బజరంగీ బాయ్‌జాన్’లో పాకిస్తాన్ జర్నలిస్టు పాత్రకు స్ఫూర్తి చాంద్ నవాబ్. ఈ చిత్రంలో పాక్ జర్నలిస్టుగా నటించిన నవాజుద్దీన్ సిద్దిఖీ పాత్ర పేరు కూడా చాంద్ నవాబ్ కావడం గమనార్హం. ఈ చిత్రం పాకిస్తాన్‌లో కూడా సూపర్ హిట్టవడంతో చాంద్ నవాబ్ హఠాత్తుగా సెలబ్రిటీ అయ్యారు. మొన్నటి వరకు ఆయన కరాచీ ప్రెస్ క్లబ్‌కు రోజూ వెళ్లినా ఎవరూ పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు అక్కడికొచ్చే జర్నలిస్టులంతా అతనితోని ఫొటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడడమే కాకుండా కేవలం అతన్ని కలుసుకునేందుకే ప్రెస్‌క్లబ్‌కు ఎంతో మంది వస్తున్నారు.
చాంద్ నవాబ్ సినిమాకు ఎలా స్ఫూర్తినిచ్చారంటే.....
2008లో చాంద్ నవాబ్ ఓ చిన్న టీవీ చానెల్ తరఫున కరాచి రైల్లే స్టేషన్లో నిలబడి వచ్చిపోయే రైళ్ల రాకపోకల గురించి ‘పీస్ టూ కెమేరా (పీ టు సీ) అనే కార్యక్రమం నిర్వహించేవాడు. ఆ సందర్భంగా తనకుగానీ, కెమేరాకుగానీ అడ్డొచ్చే ప్రయాణికులను తప్పుకోమని కోరేవాడు. కొన్ని సార్లు వారిని తోసేసేవాడు, తనదైన రీతిలో ప్రయాణికులను తిట్టేవాడు. ఇదంతా ఫన్నీగా ఫీలైన ఆయన మిత్రులు ఆ కార్యక్రమం ఎడిట్ చేయని వీడియో క్లిప్పింగ్‌ను 2008, డిసెంబర్ 8వ తేదీన ‘యూట్యూబ్’లో పోస్ట్ చేశారు. అది అప్పట్లో హల్‌చల్ చేసింది. ఆ వీడియో క్లిప్పింగ్‌ను స్ఫూర్తిగా తీసుకొని బజరంగీ బాయ్‌జాన్ చిత్రంలో జర్నలిస్టు పాత్రను సృష్టించారు.
తనను సెలబ్రిటీని చేసిన చిత్రం హీరో సల్మాన్ ఖాన్, తన పాత్రధారి సిద్దిఖీ, దర్శకుడు కబీర్ ఖాన్‌కు చాంద్ నవాబ్ కృతజ్ఞుతలు తెలియజేశారు. తనను స్ఫూర్తిగా తీసుకోవడమే కాకుండా తన టీవీ కార్యక్రమంలో తాను ఉపయోగించిన భాషనే చిత్రంలో ఉపయోగించుకున్నందుకు తనకు కొంత సొమ్ము పరిహారంగా ముట్ట చెప్పాలని అతను కోరుతున్నారు. తానేమీ డిమాండ్ చేయడం లేదని, తానొక పేద జర్నలిస్టునని, గతేడాది తన భార్య కూడా చనిపోయిందని నవాబ్ చెబుతున్నారు. సల్మాన్ ఖాన్, కబీర్ ఖాన్‌లు తనను కలసుకునేందుకు ఇప్పటికే అపాయింట్‌మెంట్ ఇచ్చారని, ఆ సందర్భంగా తనకు కొంత సొమ్ము ఇవ్వాలని ఆశిస్తున్నానని, అలా ఇవ్వకపోయినా ఫర్వాలేదని అంటున్నారు.