బాబుకు నోటీసులు ఇచ్చే దమ్ము కేసీఆర్కు ఉందా?
అనంతపురం : దమ్ముంటే తమ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబుకు నోటీసులు ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి బహిరంగంగా సవాల్ విసిరారు. శనివారం అనంతపురంలో పల్లె రఘునాథరెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ ... రేవంత్రెడ్డి కేసు నుంచి బయటపడేందుకు కేంద్రప్రభుత్వంతో లాలూచీ పడ్డామని ప్రచారం చేయడం సరికాదన్నారు. రేవంత్రెడ్డి కేసు ఎలక్షన్ కమిషన్ పరిధిలోనిది అని అన్నారు. అయితే ఆ వ్యవహారంపై ఏసీబీ కేసు నమోదు చేస్తే ఎలా అంటూ విలేకర్ల ఎదుట తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రేవంత్రెడ్డి కేసును ఎలక్షన్ కమిషన్ పర్యవేక్షించాలని ఆయన అభిప్రాయపడ్డారు.
రేవంత్ వ్యవహారంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా కథనాలు ప్రసారం చేసిన ఛానెళ్లు, కథనాలు అందించిన పత్రికలకు మాత్రమే నోటీసులు జారీ చేశామన్నారు. చంద్రబాబుపై అసత్య ప్రచారాలు చేసినందుకే టీ న్యూస్ ఛానెల్కు నోటీసులు జారీ చేశామని చెప్పారు. అయితే ఈ విషయంలో జర్నలిస్టు సంఘాలు ఆందోళన చేయడం సరికాదన్నారు. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన నోటీసులకు సమాధానం ఇచ్చే దమ్ము లేదా అంటూ పల్లె రఘునాథరెడ్డి ఈ సందర్భంగా టీ న్యూస్ చానెల్ను ప్రశ్నించారు. రాష్ట్రంలో ఓ టీవీ ఛానెల్ ప్రసారాలపై ఎటువంటి ఆంక్షలు విధించలేదని... ఓ విలేకరి అడిగి ప్రశ్నకు సమాధానంగా పల్లె రఘునాథరెడ్డి చెప్పారు.