స్కూల్ ఆవరణలోనే జుట్టు కత్తిరించి..
ముంబయి: తమ కుమారుడిని పాఠశాల గది నుంచి ఈడ్చుకొచ్చి బయట నుంచి బార్బర్ను తెప్పించి మరీ హెయిర్ కటింగ్ చేసి అవమానించారని ముంబయిలో ఓ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. కావాలనే ఉద్దేశ పూర్వకంగా తమ కుమారుడిని కొందరు ఉపాధ్యాయులు ఈ పనిచేయించారని ఆరోపించారు. దక్షిణ ముంబయిలోని పెద్దార్ రోడ్డులో గల యాక్టివిటీ హై స్కూల్లో పదో తరగతి చదువుతున్న పదహారేళ్ల బాలుడికి ఆ స్కూల్ యాజమాన్యం గత నెల 24న స్కూల్ ప్రాంగణంలోనే జుట్టుకత్తిరించింది.
దీనిపై ఆ విద్యార్థి తల్లిదండ్రులు మహారాష్ట్ర స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్(ఎంఎస్సీపీసీఆర్)కు ఫిర్యాదు చేశారు. ఈ నెల 20న తమ పిల్లాడికి హెయిర్ కట్ చేయించామని, అయినా మరోసారి ఎందుకు కట్ చేయించాల్సి వచ్చిందని నిలదీశారు. దీనిపై మీడియా స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా.. ఈ ఘటన తన దృష్టికి రాలేదని చెప్పారు. అయితే, స్కూల్ నిబంధనల ప్రకారం డ్రెస్ కోడ్కు అనుకూలంగా జుట్టు ఉండాలని, ఆమేరకు లేని విద్యార్థులకు స్కూల్లోనే సరిచేయించాలనే ఉద్దేశంతో బార్బర్ను తీసుకొచ్చిన మాట వాస్తవం అని చెప్పారు.