ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై పార్టీల కసరత్తు
సాక్షి, హైదరాబాద్: స్థానికసంస్థల కోటాలో శాసనమండలికి జరగనున్న ఎన్నిక ల నోటిఫికేషన్ త్వరలో వెలువడనున్న నేపథ్యంలో ఆయా పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించాయి. ఇందుకు సంబంధించి ఒకవైపు ప్రధానప్రతిపక్షమైన కాంగ్రెస్‌పార్టీ నాయకులు ఎన్నికలు జరిగే ఆయా జిల్లాల వారీగా సమాలోచనలు జరుపుతున్నారు. మరోవైపు ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సీపీఐ, సీపీఎం పార్టీలు సైతం సన్నద్ధమవుతున్నాయి.
ఇప్పటికే జరిగిన వామపక్షాల సమావేశంలో ఖమ్మం జిల్లా నుంచి సీపీఐ, నల్లగొండ నుంచి సీపీఎం పోటీచేయాలని నిర్ణయించారు. తదనుగుణంగా ఆయా జిల్లాల్లో ఇతరపార్టీల మద్దతును కూడా కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌కు సంబంధించి శుక్రవారం ఖమ్మం జిల్లాకు చెందిన భట్టివిక్రమార్క, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, రాంరెడ్డి వెంకటరెడ్డి, పువ్వాడ అజయ్ ప్రైవేట్‌గా ప్రాథమిక చర్చలు జరిపారు.
ఖమ్మం జిల్లా స్థానికసంస్థల కోటాలో జరగనున్న ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులతో పాటు, సీపీఐకి చెందిన సీనియర్‌నేత పువ్వాడ నాగేశ్వరరావుకు మద్దతు ఇవ్వడంపై కూడా చర్చకు వచ్చినట్టు సమాచారం. కాంగ్రెస్‌పార్టీ నుంచి అభ్యర్థిని నిలిపితే గాయత్రి రవి, నాగుబండి రాంబాబు, శేషగిరిరావుల పేర్లను పరిశీలించాలనే అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలుస్తోంది.
ఖమ్మం జిల్లా వరకు తమ పార్టీ అభ్యర్థికి కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాల నుంచి మద్దతు వస్తుందనే ఆశాభావంతో సీపీఐ నాయకులున్నారు. ఆ జిల్లాలో తమకు తగిన బలంతో పాటు మిగతా ప్రతిపక్షాలు మద్దతునిస్తే గెలిచే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయని ఆ పార్టీ నేత ఒకరు సాక్షికి తెలిపారు. కాగా, ఇంకా ఎన్నికల నోటిఫికేషన్, షెడ్యూల్ వెలువడనందున ఆనాటికల్లా ఎన్నికలు జరిగే అన్ని జిల్లాల్లో అనేక మార్పులు వస్తాయని రాజకీయపరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.