
బ్యాంకులను ఖాళీ చేసేస్తున్నారు!
పటేల్ వర్గానికి రిజర్వేషన్లలో కోటా కల్పించాలంటూ గుజరాత్లో జరుగుతున్న ఆందోళన రోజురోజుకూ మరింత తీవ్రతరం అవుతోంది. తాజాగా పటేల్ వర్గానికి చెందినవాళ్లు అక్కడి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసేస్తున్నారు. బ్యాంకులలో తమ పేరిట ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లలోని సొమ్మును వెనక్కి తీసేసుకుంటున్నారు. తద్వారా ఆర్థిక దిగ్బంధనం సృష్టించి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నది వాళ్ల వ్యూహం.
బాబూభాయ్ పటేల్ అనే ఓ చిరుద్యోగి పొద్దున్నే బ్యాంకుకు వెళ్లి, తన పేరుమీద ఉన్న రెండు లక్షల రూపాయలు డ్రా చేసేసుకున్నారు. దానిమీద వడ్డీ రాకపోయినంత మాత్రాన తనకు వచ్చే నష్టం ఏమీ లేదని.. కానీ ప్రభుత్వానికి సమస్య తీవ్రత తెలిసి వస్తుందని ఆయన అన్నారు. ఒక్కరోజులోనే తమ బ్యాంకులో రూ. 27 లక్షలను డ్రా చేసేశారని ఉత్తర గుజరాత్లో పటేల్ వర్గం ఎక్కువగా ఉండే వాద్రాద్ గ్రామంలో బ్యాంకు వర్గాలు తెలిపాయి. ఈ వ్యవహారం ఇంకెంత దూరం వెళ్తుందో.. బ్యాంకుల లోంచి ఎంత మొత్తం నగదును బయటకు తీసేస్తారో చూడాల్సి ఉంది.