
15లోగా పట్టిసీమ నీళ్లు
ఒక పంపు ద్వారా ప్రారంభిస్తామని చంద్రబాబు వెల్లడి
- క్రమేపీ పంపుల సంఖ్య పెంచుతాం
- ఈ ఏడాది 20-30 టీఎంసీల నీటిని మళ్లిస్తాం
- అంకితం చేశామే తప్ప నీళ్లిస్తానని చెప్పలేదు
- పట్టిసీమ ఎత్తిపోతలపై అసెంబ్లీలో వాడివేడి చర్చ
- విపక్ష వైఎస్సార్‌సీపీపై ముఖ్యమంత్రి విసుర్లు
- దిక్కు తెలియక ఆరోపణలు చేస్తున్నారని ధ్వజం
- భూసేకరణను వ్యతిరేకించే వారికి ప్రాజెక్టులు కావాలని అడిగే అర్హత లేదని మండిపాటు
సాక్షి, హైదరాబాద్: పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఈ నెల 10-15 తేదీల మధ్య ఒక పంపును ప్రారంభిస్తామని, ఆ తర్వాత క్రమేపీ పంపుల సంఖ్యను పెంచుతామని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు అసెంబ్లీలో చెప్పారు. ఈ పథకం నుంచి నీళ్లను తోడి పోలవరం కుడికాల్వ ద్వారా కృష్ణానదికి తరలిస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా 80 టీఎంసీల నీటిని మళ్లించాలన్నది లక్ష్యమైనప్పటికీ.. ఈ ఏడాది 20 నుంచి 30 టీఎంసీల నీటిని మళ్లిస్తామని తెలిపారు. పట్టిసీమ గోదావరి జలాల వినియోగం-పట్టిసీమ ప్రాజెక్టుపై బుధవారం రాష్ట్ర శాసనసభలో స్వల్ప వ్యవధి చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రతిపక్ష, అధికారపక్షాల మధ్య వాడీవేడి చర్చ సాగింది. పరస్పర ఆరోపణలు, వాగ్వాదాల అనంతరం సీఎం చంద్రబాబు చర్చకు సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా విపక్షం వైఎస్సార్‌సీపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. భూసేకరణను వ్యతిరేకించేవారికి ప్రాజెక్టులు కావాలని అడిగే అర్హత లేదంటూ మండిపడ్డారు. పట్టిసీమ ప్రాజెక్టు పూర్తికాకుండా జాతికి అంకితం ఎలా చేస్తారని వైఎస్సార్‌సీపీ సభ్యులు ప్రశ్నించడాన్ని తప్పుపట్టారు. ఆ వేళ అంకితం చేశానే తప్ప నీళ్లిస్తామని చెప్పలేదన్నారు.
నదుల అనుసంధానమే లక్ష్యం..
రాష్ట్రంలో నదుల అనుసంధానమే తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు చెప్పారు. పట్టిసీమతో గోదావరి, కృష్ణా నదుల్ని అనుసంధానం చేసి చరిత్ర సృష్టించబోతున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలోని రిజర్వాయర్లలో 509 టీఎంసీల గ్యాప్ ఉందని, కర్ణాటకలోని ఆల్మట్టి, తుంగభద్ర రిజర్వాయర్లు నిండనిదే కిందకు నీళ్లొచ్చే పరిస్థితి లేదన్నారు. వచ్చే రెండు నెలల్లో వర్షాలు పడితే తప్ప కృష్ణాకు నీళ్లు రావని, ఇట్లాంటి పరిస్థితుల్ని తట్టుకునేందుకే పోలవరం ప్రాజెక్టుకు రూపకల్పన జరిగిందని చెప్పారు. గోదావరి నుంచి ఏటా సగటున రెండున్నర నుంచి ఐదువేల టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తోందని, వాటిలో కొంతభాగాన్ని కృష్ణాకు తరలిస్తే నీటి ఇబ్బంది ఉండదన్నారు. పోలవరం పూర్తికి ఇంకా నాలుగేళ్లు పడుతుందని, ఈలోగా ఇటు కృష్ణా డెల్టాను, అటు రాయలసీమను ఆదుకునేందుకు తాత్కాలిక ప్రాతిపదికన ‘పట్టిసీమ’ను చేపట్టామన్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు చేపట్టినప్పటినుంచి పడిన ఇబ్బందుల్ని, రైతుల్ని ఒప్పించి 1,822 ఎకరాల భూమి సేకరించిన తీరును ఏకరువు పెట్టారు.
ఇదో చరిత్ర..
'పట్టిసీమ వల్ల ఉభయగోదావరి జిల్లాలకు ఎటువంటి నష్టం జరగదు. గోదావరి డెల్టాకు నీరిచ్చాకే కృష్ణాకు మళ్లిస్తాం. ప్రాజెక్టు పూర్తికాకుండా జాతికి అంకితం ఎలా చేస్తారని కొందరంటున్నారు. ఆవేళ అంకితం చేశానేతప్ప నీళ్లిస్తానని చెప్పలేదు. ఏమైనా మా ఈ ప్రాజెక్టు.. ఇదో చరిత్ర. గోదావరి-కృష్ణా నదుల తర్వాత మిగతా వాటిని కలిపేందుకు ప్రయత్నం జరుగుతుంది. పోలవరాన్ని 2018కి పూర్తి చేస్తాం. పట్టిసీమను ఎంత వేగంగా పూర్తి చేశామో అదేమాదిరి చేస్తాం. ఇరిగేషన్‌కు గత 15 నెలల్లో రూ.8,567 కోట్లు వ్యయం చేస్తే విపక్షం దిక్కుతెలియక ఆరోపణలు చేస్తోంది. హంద్రీ-నీవాను పుంగనూరు వరకు, గాలేరు-నగరిని గండికోట వరకు తీసుకెళ్లి నీళ్లిస్తాం' అని చెప్పారు.
భూసేకరణను వ్యతిరేకిస్తే నీళ్లెక్కడినుంచి వస్తాయి?
ఢిల్లీలోనైనా ఇక్కడైనా భూసేకరణను వ్యతిరేకిస్తే నీళ్లు ఎక్కడినుంచి వస్తాయని చంద్రబాబు ప్రశ్నించారు. భూసేకరణను వ్యతిరేకించే వారికి ప్రాజెక్టులు కావాలని అడిగే అర్హత లేదన్నారు. సోమశిల-స్వర్ణముఖి ద్వారా ఈ ఏడాది బాలాజీ రిజర్వాయర్‌కు నీళ్లు సరఫరా చేస్తామని చెప్పారు. వెలుగొండను ఈ ఏడాది పూర్తి చేస్తామన్నారు. పట్టిసీమ నుంచి నీటిని కృష్ణాకు తరలించి ఎగువ నుంచి(కర్ణాటక వైపు) వచ్చేనీటిని రాయలసీమకు ఉపయోగిస్తామని చెప్పారు. రాయలసీమకు నీళ్లిస్తే ఉద్యానవన పంటలు బాగా పండించవచ్చునన్నారు. పట్టిసీమ నుంచి ఎత్తిపోసే 80 టీఎంసీల నీటితో 8 లక్షల ఎకరాల్లో పంట పండుతుందని, రూ.1,200 కోట్ల ఆదాయం వస్తుందన్నారు. అంతకుముందు నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పట్టిసీమ ప్రాజెక్టు పూర్వాపరాల్ని వివరిస్తూ మూడు పేజీల నోట్‌ను సభకు సమర్పించారు.
విపక్షంపై అధికారపక్షం ఎదురుదాడి
పట్టిసీమపై విపక్షమైన వైఎస్సార్‌సీపీ వైఖరేమిటో చెప్పాలని సీఎం కోరారు. అనుకూలమో వ్యతిరేకమో చెప్పాలన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఉపనేత జ్యోతుల నెహ్రూకు, చంద్రబాబుకు మధ్య సంవాదం నడిచింది. ఇదేఅదునుగా పలువురు మంత్రులు ఎదురుదాడికి దిగగా.. వైఎస్సార్‌సీపీ సభ్యులు తిప్పికొట్టారు. అధికారపక్షం వైఖరితో విసిగిపోయిన సభ్యులు ఓ దశలో స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి నినాదాలతో హోరెత్తించారు. పోలవరం ప్రాజెక్టు వ్యతిరేకి చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. తమ సభ్యుడు శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడేందుకు అనుమతివ్వాలని కోరారు. దీనిపై సీఎం చంద్రబాబు విపక్ష సభ్యులమీద మండిపడ్డారు.