
పెళ్లైన కూతురుంది.. పోర్న్ చూస్తాడట!
- వర్మపై పవన్ తీవ్రవ్యాఖ్యలు
హైదరాబాద్: తరచూ ట్వీట్లతో రెచ్చగొడుతోన్న దర్శకుడు రాంగోపాల్ వర్మపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఊహించనివిధంగా ఎదురుదాడి చేశారు. శుక్రవారం జనసేన కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో పవన్.. ఏపీ ప్రత్యేక హోదా అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగట్టారు. ఈ సందర్భంగా కొందరు విలేకరులు.. ‘వర్మ కామెంట్లపై మీరేమంటారు?’అని పవన్‌ను ప్రశ్నించారు. మొదట..‘నో కామెంట్స్.. నేను పట్టించుకోను..’అన్న జనసేన అధినేత, అంతలోనే వర్మ వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు.
‘రాంగోపాల్ వర్మకు ప్రస్తుతం ఓ 50 ఏళ్లు ఉంటాయనుకుంటా. పెళ్లైన ఓ కూతురు కూడా ఉందాయనకు. కానీ ఆ పెద్దమనిషి పొద్దున లేస్తే పోర్న్ సినిమాలు చూస్తానని చెప్పుకుంటాడు. ఒకరోజు నన్ను ఎత్తుతాడు, ఇంకోరోజు దించుతాడు. అలాంటి వాళ్లకి సమాధానం చెప్పలేను’ అని పవన్ మండిపడ్డారు. ‘ఏపీ సమస్యలపై పవన్ ట్విట్టర్‌లో కాకుండా క్షేత్రస్థాయిలో పోరాటం చెయ్యాలి’అని వర్మ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.
గతంలో ‘ఖైదీ నంబర్150’ సినిమా ఫంక్షన్‌లోనూ పవన్ సోదరుడు నాగబాబు.. వర్మపై ‘వాడు.. వీడు’ అంటూ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. నాటి నాగబాబు వ్యాఖ్యలకు గట్టిగా బదులిచ్చిన వర్మ.. పీకే(పవన్‌ను వర్మ సంబోధించే తీరు) విషయంలో ఎలా స్పందిస్తారో వేచిచూడాలి..