
'వైఎస్ఆర్ కంటే దీటుగా వైఎస్ జగన్ పరిపాలిస్తారు'
విజయవాడ: దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కంటే దీటుగా ఆయన కుమారుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలించగలరని ఆ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఏపీ రాజధాని ప్రాంతంలో బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా విజయవాడ సీఆర్డీఏ కార్యాలయం వద్ద వైఎస్ జగన్ చేపడుతున్న ధర్నాలో పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణం పేరుతో మూడు పంటలు పండే భూములను లాక్కొంటున్నారని విమర్శించారు.
తాము రాజధానికి వ్యతిరేకం కాదని, బలవంతపు భూసేకరణకే వ్యతిరేకమని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాగునీటి ప్రాజెక్టులు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను పక్కనపెట్టేశారని విమర్శించారు. రాజధాని నిర్మాణం పేరుతో భూముల వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు.