పదహారు నెలల జైలు జీవితం నుంచి వైఎస్ జగన్ జనంలోకి అడగుపెట్టగానే వాడవాడలా సంబరాలు అంబరాన్నంటాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా బాణసంచా కాలుస్తూ, డప్పులు వాయిస్తూ, కేరింతలు కొడుతూ ఆనందోత్సాహాలు జరుపుకున్నారు.
రెండో రోజూ రాష్ట్ర వ్యాప్తంగా మిన్నంటిన సంబరాలు
సాక్షి నెట్‌వర్క్: పదహారు నెలల జైలు జీవితం నుంచి వైఎస్ జగన్ జనంలోకి అడగుపెట్టగానే వాడవాడలా సంబరాలు అంబరాన్నంటాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా బాణసంచా కాలుస్తూ, డప్పులు వాయిస్తూ, కేరింతలు కొడుతూ ఆనందోత్సాహాలు జరుపుకున్నారు. వైఎస్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి జై జగన్.. జైజై జగన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. కర్నూలులో వైఎస్సార్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో న్యాయవాదులు, కక్షిదారులకు స్వీట్లు పంచిపెట్టారు.
ఆళ్లగడ్డ మండలం అహోబిలం దేవస్థానంలో అన్నదానం నిర్వహించారు. కడపలో అప్సర సర్కిల్‌లో ఆటోకార్మికులు, మాసీమ బాబు ఆధ్వర్యంలో మాసీమ సర్కిల్‌లో, అల్మాస్‌పేట యూత్ ఆధ్వర్యంలో వైఎస్సార్‌సర్కిల్‌లో, పవర్ అల్తాఫ్ ఆధ్వర్యంలో అల్‌షిఫా మానసిక వికలాంగుల పునరావాస కేంద్రంలో అన్నదానం నిర్వహించారు. జిల్లాలోని అనేక దేవాలయాల్లో టెంకాయలు కొట్టి అభిమానులు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతపురం జిల్లాలో పేద మహిళలకు చీరలు పంపిణీ చేయగా, కార్యకర్తలు అన్నదానం నిర్వహించారు. జైలు నుంచి జగన్ విడుదల దృశ్యాలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు తిరుపతి తుడా సర్కిల్‌లో భారీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. అక్కడే మధ్యాహ్న భోజనాలు ఏర్పాటుచేశారు.
విశాఖ జిల్లాలో పలుచోట్ల వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు బైక్‌ర్యాలీలు నిర్వహించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. వాడవాడలా ర్యాలీలు, పూజలు చేసి, బాణసంచా కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. ఎచ్చెర్ల నియోజవర్గంలో వెయ్యి బైకులతో భారీ ర్యాలీ నిర్వహించారు. కృష్ణా జిల్లాలో పలుచోట్ల వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు క్షీరాభిషేకం చేశారు. పెద్ద ఎత్తున మిఠాయిలు పంచిపెట్టడంతోపాటు, బైక్ ర్యాలీలు తీశారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జగన్ అభిమానులు కోయవేషాలతో సందడి చేశారు.
జంగారెడ్డిగూడెంలో అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అయ్యప్ప గుడిలో పూజలు జరిపారు. తూర్పుగోదావరి జిల్లా ఎన్.కొత్తపల్లి, కూనవరంలలో దళిత పేటల్లో సామూహిక భోజనాలు చేశారు. అంధుల పాఠశాలలో పండ్లు పంచిపెట్టారు. ఏజెన్సీలో ప్రదర్శన నిర్వహించి చర్చిల్లో, మసీదుల్లో ప్రార్థనలు, దేవీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గుంటూరు జిల్లాలో వృద్ధులు, మహిళలకు నూతన వస్త్రాలు, పండ్లు పంచిపెట్టారు. మంగళగిరిలోని పానకాల స్వామికి 101 బిందెల పానకాన్ని సమర్పించారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో చిన్నారులకు స్వీట్లు, పండ్లు, బెలూన్లు పంపిణీ చేశారు.
ఖమ్మం జిల్లా భద్రాచలం రామాలయంలో వైఎస్ అభిమానులు తలనీలాలు సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. ఇల్లెందులో సమ్మక్కసారక్క గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదానం చేశారు. నల్లగొండ జిల్లాలో స్వీట్లు పంపిణీ చేసి, ర్యాలీలు తీశారు. వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలోనూ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. బెంగళూరులోనూ మంగళవారం సంబరాలు కొనసాగాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రవాసాంధ్రులు ఉదయం నుంచే సంబరాల్లో మునిగితేలారు. పెద్ద ఎత్తున బాణ సంచా పేల్చారు. స్వీట్లు పంచుతూ హర్షం వ్యక్తం చేశారు.