ఆ హత్య గురించి రెండోభర్తకు తెలుసట!
ఆ హత్య గురించి రెండోభర్తకు తెలుసట!
Published Fri, Oct 21 2016 6:52 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 PM
కన్నకూతురు షీనా బోరాను ఇంద్రాణి చంపుతున్న విషయం.. ఆమె రెండో భర్త పీటర్ ముఖర్జీకి పూర్తిగా తెలుసునట. ఈ విషయాన్ని పేర్కొంటూ ఈ సంచలనాత్మక హత్యకేసులో సీబీఐ రెండో అనుబంధ చార్జిషీటు దాఖలుచేసింది. తనకు ఈ హత్య గురించి ఏమీ తెలియదని ఇంతకుముందు పీటర్ వాదించినా.. హత్య నుంచి మృతదేహాన్ని తరలించడం ప్రతి విషయంలోనూ అతడి పాత్ర కూడా ఉందని సీబీఐ తాజా చార్జిషీటులో పేర్కొంది. అతడిపై నేరారోపణ మోపడంపై వాదనలు శనివారం ప్రారంభం కానున్నాయి.
2012 ఏప్రిల్ నెలలో షీనాబోరా (24)ను కారులో గొంతు నులిమి చంపేశారు. ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జీ, ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నా, ఆమె మాజీ డ్రైవర్ శ్యామవర్ రాయ్ తదితరుల హస్తం ఇందులో ఉందని ఆరోపణలొచ్చాయి. తర్వాత ఆమె మృతదేహాన్ని పొరుగున ఉన్న రాయగడ్ జిల్లాలోని ఓ అడవిలో పారేశారు. ఆ ముగ్గురినీ గత సంవత్సరం ఆగస్టు నెలలో అరెస్టు చేశారు. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్న నేరానికి శ్యామ్‌వర్ రాయ్‌ని అరెస్టుచేసి విచారించినప్పుడు అతడు బయటపెట్టడంతో ఈ హత్య వెలుగులోకి వచ్చింది. తర్వాతి నుంచి అతడు అప్రూవర్‌గా మారాడు.
పీటర్ ముఖర్జీతో తన సంబంధం విషయం తెలియని షీనాబోరా.. అతడి కొడుకు రాహుల్‌ను పెళ్లి చేసుకోవాలనుకుందని, అదే జరిగితే ఆమెకు ఆస్తిలో చాలా భాగం వెళ్లిపోతుందన్న భయంతోనే ఇంద్రాణి ఆమెను చంపడానికి ప్లాన్ వేసినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి.
Advertisement