
పెట్రో డీలర్ల సమ్మెబాట
► రెండ్రోజులపాటు పెట్రోలియం ఉత్పత్తుల
కొనుగోళ్లు నిలిపివేత
► దేశవ్యాప్త నిరసనలో భాగంగానే...
► డిమాండ్ల సాధనపై నేడు ముంబైలో
చమురు పరిశ్రమతో చర్చలు
► చర్చలు విఫలమైతే రేపట్నుంచి ఉదయం
9 గం. నుంచి సాయంత్రం 6 గం. వరకే విక్రయాలు
► 6వ తేదీ నుంచి సెలవు రోజుల్లో అమ్మకాలు బంద్
► 15న పూర్తిస్థాయిలో బంద్ పాటింపు
సాక్షి, హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ విక్రయాలపై కమీషన్ పెంపు సహా ఇతర డిమాండ్ల సాధన కోసం పెట్రోలియం డీలర్లు సమ్మెబాట పట్టారు. దేశవ్యాప్త నిరసనలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా గురు, శుక్రవారాల్లో చమురు సంస్థల నుంచి పెట్రోలియం ఉత్పత్తుల కొనుగోళ్లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. డిమాండ్ల సాధన కోసం చమురు పరిశ్రమ ప్రతినిధులతో శుక్రవారం సాయంత్రం ముంబైలో జరిగే చర్చలు విఫలమైతే 5వ తేదీ నుంచి కేవలం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే బంకులు నడుపుతామని పేర్కొన్నారు. 6వ తేదీ నుంచి ప్రతి ఆదివారంతోపాటు ప్రతి రెండో, నాలుగో శనివారాలు, బ్యాంకు, ప్రభుత్వ సెలవు దినాల్లో అమ్మకాలను నిలిపివేయనున్నారు. ఈ నెల 15న పూర్తిస్థాయిలో బంకుల బంద్ పాటించనున్నారు. డీలర్లు ఇప్పటికే గత నెల 19 , 26 తేదీల్లో సాయంత్రం 15 నిమిషాలపాటు అమ్మకాలు నిలిపి నిరసన తెలిపారు.
కమీషన్ పెంచాల్సిందే
పెట్రోల్, డీజిల్ విక్రయాలపై ప్రస్తుతం 3 శాతంగా ఉన్న కమీషన్‌ను 5 శాతానికి పెంచాలన్నదే డీలర్ల ప్రధాన డిమాండ్‌గా ఉంది. డీలర్ల మార్జిన్‌పై 2011లో కేంద్ర ప్రభుత్వం నియమించిన అపూర్వ చంద్ర కమిటీ సిఫార్సులను అమల్లో చమురు సంస్థలు పూర్తిగా విఫలయమయ్యాయయని డీలర్ల సంఘం ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఆరు నెలలకోసారి తమ కమీషన్ ను పెంచే దిశగా చర్యలు చేపడతామని భరోసా ఇచ్చిన చమురు సంస్థలు ఇప్పటికీ హామీని నెరవేర్చలేకపోయాయని విమర్శిస్తున్నారు. డీలర్లకు తెలియజేయకుండా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే విధానానికి స్వస్తి పలకాలని, కొత్త పెట్రోల్ బంక్‌ల ఏర్పాటుకు అనవసరంగా అనుమతులు ఇవ్వరాదని, 2012లో జారీ చేసిన మార్కెటింగ్ డిసిప్లిన్ గైడ్‌లైన్స్ (ఎండీజీ)ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్లను నెరవేర్చకుంటే నిరసనను ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.
రాజధానిలో పెట్రో ఉత్పత్తులకు ఏర్పడనున్న కొరత...
రాష్ట్రంలో మొత్తం 1,564 పెట్రోల్ బంకులు ఉండగా అందులో హైదరాబాద్ మహానగర పరిధిలో 460 బంకులు ఉన్నాయి. సాధారణంగా ఆయిల్ కంపెనీల టెర్మినల్స్ నుంచి నిత్యం హైదరాబాద్‌లోని పెట్రోల్ బంకులకు 150 నుంచి 170 ట్యాంకర్ల ద్వారా ఇంధనం సరఫరా అవుతుంది. ఒక్కో ట్యాంకర్ సగటున 12 వేల లీటర్ల నుంచి 20 వేల లీటర్ల వరకు సామర్థ్యం కలిగి ఉంటుంది. డీలర్ల రెండ్రోజుల నిరసన వల్ల శుక్రవారం సాయంత్రానికి సగానికిపైగా బంకులు మూతపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
స్టాక్ ఉన్నంత వరకు అమ్మకాలు
చమురు మార్కెటింగ్ కంపెనీల నుంచి మాకు మార్జిన్లు తగ్గుతున్న కారణంగా నిరసన చేపట్టాలని నిర్ణయించాం. ఇందులో భాగంగానే రెండ్రోజులపాటు పెట్రో ఉత్పత్తుల కొనుగోళ్లు నిలిపేస్తున్నాం. స్టాక్ ఉన్నంత వరకు అమ్మకాలు జరుపుతాం. ఇందుకు వినియోగదారులు సహకరించాలి. పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై కమీషన్‌ను 5 శాతానికి పెంచడంతోపాటు దేశవ్యాప్తంగా ఒకే ధరల విధానం అమలు, ధరల హెచ్చుతగ్గుల వల్ల సంభవించే నష్టం రీయింబర్స్‌మెంట్, కొత్త అవుట్‌లెట్ల ఏర్పాటు వల్ల వాటి సమీప బంకులపై ప్రభావం లేకుండా చర్యలు, బంకుల్లో వినియోగదారుల కోసం ఏర్పాటు చేసిన మరుగుదొడ్ల నిర్వహణ బాధ్యతలను చమురు సంస్థల ద్వారా థర్డ్ పార్టీకి అప్పగించడం వంటి డిమాండ్లను చమురు సంస్థలు చేపట్టాలి.
– జి. వినయ్ కుమార్, తెలంగాణ రాష్ట్ర పెట్రోలియం డీలర్ల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి