దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన ముంబై ఫోటో జర్నలిస్టు సామూహిక అత్యాచారం ఘటనకు సంబంధించిన ఐదవ నిందితుడు సలీం అన్సారీని మహారాష్ట్ర క్రైం బ్రాంచ్ పోలీసులు ఆదివారం న్యూఢిల్లీలో అరెస్ట్ చేసినట్లు ముంబై పోలీసు కమిషనర్ వెల్లడించారు. అతన్ని సాధ్యమైనంత త్వరగా ముంబై తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. సలీం అరెస్ట్తో అత్యాచారం కేసులో మొత్తం నిందితులను అరెస్ట్ చేసినట్లు వివరించారు.
అయితే అత్యాచారానికి పాల్పడిన నాలుగో నిందుతుడు కసీం బెంగాలీని గత అర్థరాత్రి అరెస్ట్ చేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. నిందితుల్లో చంద్‌బాబు సత్తార్ షేక్ అలియాస్ మహమ్మద్ అబ్దుల్ (19)ను పోలీసులు శుక్రవారమే అరెస్టు చేయగా, శనివారం మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటైన మహాలక్ష్మీ పరిసరాల్లోని శక్తిమీల్స్లో అసాంఘిక కార్యకలపాలపై కథనం కోసం విధినిర్వహాణలో భాగంగా సహాయకునితో కలసి ఫోటో జర్నలిస్ట్ అక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడ కొంత మంది యువకులు ఫోటోలు తీయవద్దని బెదిరించారు. అనంతరం ఆమెపై దాడి చేయబోయారు. యువకుల ప్రయత్నాన్ని ఆమె సహాయకుడు అడ్డుకున్నాడు. దాంతో అతడిని తీవ్రంగా గాయపరిచి, కాళ్లు చేతులు కట్టేశారు. ఫోటో జర్నలిస్ట్పై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన సంగతి తెలిసిందే. ఆమె ప్రస్తుతం జస్లోక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.