‘తుంగలో దొంగ’ పైపుల తొలగింపు
సాక్షి, బళ్లారి (కర్ణాటక): రాష్ట్రానికి సంబంధించిన తుంగభద్ర నదీ జలాలను కర్ణాటకలో అక్రమంగా దోపిడీ చేస్తున్న వైనంపై ‘సాక్షి’ దినపత్రికలో శనివారం ప్రచురితమైన ‘తుంగలో దొంగ’ కథనానికి తుంగభద్ర బోర్డు అధికారులు స్పందించారు. ఈఈ నారాయణనాయక్ నేతృత్వంలో పలువురు ఎస్‌డీఓలు శనివారం ఉదయం ఎల్‌ఎల్‌సీ గట్టుపై పర్యటించారు. కాలువలోని నీటిని తోడేందుకు వేసిన పైపులను తొలగించారు. ఈ సందర్భంగా ఈఈ నాయక్ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ప్రతి రోజు తాము పైపులను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ రాత్రుళ్లు రైతులు అక్రమంగా నీటిని తోడుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రత్యేక పోలీసు బలగాలు నిత్యం కాలువపై పర్యటించి పైపులను తొలగించేందుకు పూనుకుంటే రైతులకు కొంత భయం ఏర్పడుతుందన్నారు.
బోర్డు కార్యదర్శికి అఖిలపక్ష నేతల డిమాండ్
తుంగభద్ర డ్యామ్ పరిధిలో జలచౌర్యానికి పాల్పడుతున్న కర్ణాటక రైతులను అడ్డుకునేలా చర్యలు తీసుకోవాలని టీబీ బోర్డు కార్యదర్శి రంగారెడ్డిని అనంతపురానికి చెందిన అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. అఖిల పక్ష నేతలు శనివారం టీబీ డ్యామ్, హెచ్‌ఎల్‌సీలను పరిశీలించారు. అనంతరం బోర్డు కార్యదర్శి రంగారెడ్డితో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రైతులు పడుతున్న కష్టాలను వివరించారు. ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన ‘తుంగలో దొంగ’ కథనాన్ని కార్యదర్శికి చూపించి ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించారు. డ్యామ్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు సక్రమంగా నీరందడం లేదని, హెచ్‌ఎల్‌సీకి 44 కిలోమీటర్ నుంచి 105 కిలోమీటర్ వరకు ప్రత్యేక కాలువ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
అనంతరం కార్యదర్శి రంగారెడ్డి మాట్లాడుతూ.. తాను నెల రోజుల కిందటే బాధ్యతలు తీసుకున్నానని, ఆంధ్రప్రదేశ్‌కు అందాల్సిన వాటాను సక్రమంగా అందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. జలచౌర్యాన్ని అరికట్టేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తానన్నారు. ప్రత్యేక పోలీసు బలగాలను రప్పించి నీటి దొంగలను అరెస్ట్ చేస్తామని హామీ ఇచ్చారు. అఖిలపక్ష బృందంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్యక్షుడు, రాష్ట్ర సీపీఐ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ, సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్, వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జిల్లా కన్వీనర్ బోరంపల్లి ఆంజనేయులు, పార్టీ జిల్లా నాయకుడు ఆలమూరు శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు కర్రా హనుమంతరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంకాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి డి.వెంకటేశ్వరరెడ్డి, లోక్‌సత్తా పార్టీ కార్యదర్శి పులిచెర్ల నిజాం వలీ తదితరులు ఉన్నారు.