ఆ పాపకు పేరుపెట్టిన ప్రధాని మోదీ
వారణాసి : ఒక వ్యక్తిపై ఉన్న అభిమానంతో ఎంతోమంది తమకు పుట్టిన పాపలకు వారి పేర్లు పెడుతుండటం లేదా వారి ఆశీర్వాదాలు చిన్నారులకు ఇప్పించడం వంటివి చేస్తుంటారు. గుజరాత్ లోని ఓ మిర్జాపూర్ జంట కూడా ప్రధాని మోదీపై ఉన్న అమితమైన ఆరాధనతో, తమకు పుట్టిన పాపకు మోదీతో పేరు పెట్టించుకోవాలనుకున్నారు. వారి అభిలాషను ఓ లేఖ ద్వారా ప్రధానికి తెలియజేశారు. వెంటనే స్పందించిన ప్రధాని, వారికి పుట్టిన పాపకు తాను పేరు పెడుతున్నట్టు ఆ జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ కాల్ చేశారు. "హలో, నేను నరేంద్రమోదీని, మీ భార్య విభ సింగ్ రాసిన ఉత్తరం నాకు అందింది. పాప పుట్టినందుకు శుభాకాంక్షలు. నా ఆశీస్సులు ఎల్లవేళలా మీ పాప తోడుంటాయి. పాప పేరు వైభవిగా నామకరణం చేస్తున్నా. ఈ పేరు తల్లిదండ్రుల ఇద్దరి పేర్ల కలయిక" అని విభ సింగ్ భర్త భరత్కు ఫోన్ లైన్లో తెలిపినట్టు అతను చెప్పాడు.
ప్రధాని మోదీ నుంచి ఫోన్ రావడం ఒక్కసారిగా తమల్ని ఆశ్చర్యకితుల్ని చేసిందని మిర్జాపూర్ జిల్లా నయపురా హసిపురా గ్రామానికి చెందిన ఆ జంట ఆనందం వ్యక్తంచేస్తోంది. తన కూతురు చాలా అదృష్టవంతురాలని, ప్రధాని చేత పేరు పెట్టించుకుందని పాప తండ్రి సంబర పడుతున్నాడు. ఆగస్టు 13న తమకు పాప పుట్టిందని, ప్రధానిని ఆరాధించే తాము, పాపకు మోదీచే పేరు పెట్టాలని భావించామని పేర్కొన్నాడు. వెంటనే తన భార్య ఓ లేఖ రాసిందని, దాన్ని అదేరోజు స్పీడ్ పోస్టులో పీఎంఓకు పంపినట్టు పేర్కొన్నాడు. అయితే భరత్ చెప్పిన స్టోరీని పొరుగింటి వారు నమ్మకపోవడంతో, ఈ విషయంపై పీఎంఓకు ఓ అభ్యర్థన లేఖ రాశాడు. వెంటనే పీఎం వారి పాపను దీవిస్తున్నట్టు ఉత్తరాన్ని కూడా భరత్కు పంపారు. "పాపకు జన్మనిచ్చినందుకు శుభాకాంక్షలు, వైభవి కలలను మీరు సాకారం చేయాలని దీవిస్తున్నాను. వైభవి మీకు కొండంత బలం అవ్వాలని కోరుకుంటున్నా" అని లేఖలో ఆశీర్వదించారు.