
'మోదీ తాత చాక్లెట్లిచ్చారు'
పుణె: నిజమైన ఆనందమంటే ఆరేళ్ల వైశాలిదే. చిల్లు పడిన తన గుండెను సరిచేయడానికి సహకరించి ప్రధానమంత్రిని కలుసుకున్నప్పుడు ఆమె ముఖంలో కనిపించిన సంతోషం.. బహుశా నరేంద్ర మోదీకి కూడా కిక్ ఇచ్చి ఉండొచ్చు. ప్రధాని కార్యాలయం(పీఎంవో) సహకారంతో ఇటీవలే గుండె ఆపరేషన్ చేయించుకున్న చిన్నారి వైశాలి శనివారం పుణెలో ప్రధానమంత్రిని కలుసుకుంది. స్మార్ట్ సిటీ మిషన్ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు శనివారం పుణె వచ్చిన ప్రధాని మోదీ కాస్తంత తీరికచేసుకునిమరీ చిన్నారితో మాట్లాడారు. (చదవండి: హృద్రోగ బాలిక లేఖకు పీఎంఓ స్పందన)
కుటుంబ సభ్యులతో కలిసి తన వద్దకు వచ్చిన వైశాలిని ప్రధాని మోదీ ఆప్యాయంగా పలకరించారు. మరాఠీ భాషలో ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అటుపై గుప్పెడు చాక్లెట్లు ఇచ్చి సంతోషపెట్టారు. భేటీ అనంతరం వైశాలి కుటుంబసభ్యులు మీడియాతో మాట్లాడుతూ.. 'మోదీగారి దయవల్లే మా పాప బతికింది. ఎలాంటి బెరకు లేకుండా ప్రధానితో మాట్లాడిన వైశాలి.. 'మోదీ తాత నాకు చాక్లెట్లిచ్చారని' అందరితో చెప్పుకుంటోంది. ఆయన మేలును మర్చిపోం' అని అన్నారు. వైశాలిని కలుసుకోవడం సంతోషంగా ఉందటూ భేటీ అనంతరం ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
Young Vaishali wrote to me seeking help for her heart surgery. Glad that we were able to help this little girl. pic.twitter.com/oj0007vIsa
— Narendra Modi (@narendramodi) 25 June 2016