
'పాకీస్థానీలనూ ఇండియన్ ఆర్మీ కాపాడింది'
భోపాల్: సైన్యం మాట్లాడదు కానీ ప్రరాక్రమం చూపుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అయితే సైనికులంటే కేవలం పరాక్రమానికే కాదు మానవత్వానికి కూడా ప్రతీకలని ఉద్ఘాటించారు. సైనికుల త్యాగాల వల్లే పౌరులు సుఖంగా జీవించగలుగుతున్నరని గుర్తుచేశారు. యుద్ధంలో అమరవీరులైన సైనికుల స్మృత్యార్థం దేశంలోనే మొట్టమొదటిగా భోపాల్ లో నిర్మించిన అమరవీరుల స్మారక కేంద్రం (శౌర్య స్మారక్)ను శుక్రవారం ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్మీ మాజీ ఉద్యోగులను ఉద్దేశించి మోదీ మాట్లాడారు.
'యుద్ధ వీరులను స్మరించుకోవడం నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నా. ఆర్మీ అనగానే మొదట గుర్తొచ్చేది వాళ్ల యూనిఫాం. అది పరాక్రమానికేకాదు మానవత్వానికి కూడా చిహ్నంగా ఉంటుంది. జమ్ముకశ్మీర్ ను వరదలు ముంచెత్తినప్పుడు సైన్యం రంగంలోకి దిగి ప్రజలను కాపాడింది.. ఎవరైతే రోజూ తమ మీద రాళ్లు విసురుతారో, అలాంటి ప్రజలను భుజాలపై మోస్తూ సురక్షిత ప్రాంతాలకు తరలించింది. అంతెందుకు.. ఈ ఏడాది ప్రారంభంలో యెమెన్ లో అంతర్యుద్ధం తలెత్తినప్పుడు అక్కడ చిక్కుకున్న ఎంతో మంది భారతీయులతోపాటు పాకిస్థానీలను కూడా ఇండియన్ ఆర్మీ కాపాడింది. అసలైన మానవత్వం అంటే ఇదే' అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
సైనికుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ప్రధాని.. ఏళ్లుగా నానుతోన్న వన్ ర్యాంక్ వన్ పెన్షన్ పథకం అమలుతో మాజీ సైనికులకు లబ్దిచేకూర్చామన్నారు. రక్షణ మంత్రి మనోహర్ పారికర్ మాట్లాడుతూ.. శత్రు శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్స్ చేసిన తరుణంలోనే ఈ స్మారక స్థూపాన్ని ప్రారంభించుకోవడం గర్వంగా ఉందన్నారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహార్ మాట్లాడుతూ అమరులైన సైనికుల కుటుంబ సభ్యులకు తమ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నెలకు రూ.5వేలు క్రమంతప్పకుండా అందిస్తామని ప్రకటించారు.