మీకోసం భారత్ ఎదురుచూస్తోంది | PM Narendra modi made historic speech at Johannesburg, South Africa | Sakshi
Sakshi News home page

మీకోసం భారత్ ఎదురుచూస్తోంది

Published Sat, Jul 9 2016 2:36 AM | Last Updated on Thu, Apr 4 2019 5:21 PM

మీకోసం భారత్ ఎదురుచూస్తోంది - Sakshi

మీకోసం భారత్ ఎదురుచూస్తోంది

- దక్షిణాఫ్రికాలో ప్రవాసభారతీయులకు మోదీ పిలుపు

- మీరు భారత్ గర్వించదగ్గ వారసత్వ సంపద

- మన రెండు దేశాలూ యువరక్తం గల దేశాలు

- మనం ఉమ్మడిగా సరికొత్త విలువలు సృష్టించగలం .. పేదరికం, ఆకలి, పోషకాహార లోపాలపై పోరాడగలం

- ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ ఉజ్వల కేంద్రం.. భారత విజయగాథ ‘హోప్’

- డిజిటల్ విప్లవం తెస్తున్నాం

- 2022 నాటికి దేశంలో 50 కోట్ల ఉద్యోగాల సృష్టి లక్ష్యం

 

జొహెనెస్‌బర్గ్:

భారతదేశం ఇప్పుడు ప్రపంచంలో ఆర్థికంగా ఉజ్వల బాటలో పయనిస్తోందని.. ఆశావాదం అనేది ఇప్పుడు భారత విజయగాథ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. మున్ముందు 8 శాతం వృద్ధి రేటు సాధించే దిశగా తాము కృషి చేస్తున్నామని చెప్పారు. దక్షిణాఫ్రికాలోని భారత సంతతి ప్రజలు దేశం గర్విచదగ్గ వారసత్వ సంపద అంటూ.. వారికోసం భారతదేశం ఎదురుచూస్తోందని పిలుపునిచ్చారు.

 

ఇరు దేశాలూ యువ దేశాలంటూ.. ఇద్దరూ కలిసి కొత్త విలువలు, కొత్త నైపుణ్యాలు సృష్టించవచ్చునన్నారు. దక్షిణాఫ్రికా సత్యాగ్రహానికి పుట్టినిల్లని, మహాత్ముడి రాజకీయ ఆలోచనలకు రూపునిచ్చింది ఇక్కడేనని.. మండేలా, గాంధీలు చూపిన బాట ప్రపంచానికి స్ఫూర్తి అని కొనియాడారు. జొహనెస్‌బర్గ్‌లోని ‘ద డోమ్’ ఆడిటోరియంలో భారత సంతతి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దాదాపు 15,000 మంది సభికులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రధాని ప్రసంగానికి అడుగడుగునా చప్పట్లతో హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు. మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...

 

‘‘నమస్తే.. మీ ఆత్మీయ స్వాగతానికి కృతజ్ఞతలు. విశాల హిందూ మహాసముద్రం ఆవలి నుంచి 125 కోట్ల భారతీయుల శుభాకాంక్షలను నేను తెచ్చాను. నేను నా పర్యటనను ప్రారంభంచటానికి ముందు.. ఈ పర్యటనకు ఆలోచనలు ఆహ్వానిస్తూ వ్యక్తిగతంగా మీకు ఈమెయిల్ చేశాను. వేలాది వినూత్నమైన ఉపయుక్తకరమైన సూచనలు నాకు అందాయి. నరేంద్రమోదీ ఆప్‌లో. 

మన ఉమ్మడి సాంస్కృతిక, మత, ఆధ్యాత్మిక వారసత్వ సంపద మనల్ని మన మనసుల్లో, మన ఆలోచనల్లో కలిపే ఉంచుతుంది. శతాబ్దాల కిందట మన పూర్వీకులు దక్షిణాఫ్రికాకు ప్రయాణించారు. వాళ్లు కష్టాలను, కటిక దారిద్య్రాన్ని చవిచూశారు.

 

ఆ హరివిల్లు దక్షిణాఫ్రికాలో భిన్నత్వానికి ప్రతీక...

ఈ హరివిల్లు దేశం ఆవిర్భవించాక మన సంబంధాల్లో సరికొత్త ఉజ్వల అధ్యాయం మొదలైంది. జాత్యహంకారాన్ని ధ్వంసం చేసిన తర్వాత దక్షిణాఫ్రికాను ఆలింగనం చేసుకున్న తొలి దేశం భారతదేశం. జూలై పదో తేదీ ప్రాముఖ్యత మీకు తెలుసా? 1991లో ఈ రోజున దక్షిణాఫ్రికా క్రికెట్ టీమ్ మీద అంతర్జాతీయ ఆంక్షలను తొలగించారు. కొన్ని రోజుల తర్వాత దక్షిణాఫ్రికా తన తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ను భారత్‌లో ఆడింది. హోళీ రంగులు, దిపావళి వెలుగులు, సంక్రాంతి రుచులు, ఈద్ పండుగలు కేవలం భారతీయ సంస్కృతి హరివిల్లే కాదు.. దక్షిణాఫ్రికాలో భిన్నత్వానికి అవి ప్రతీక. భారత తీరాన్ని వదిలి వచ్చిన తొలి ప్రజల్లో వాళ్లలో మీరు ఒకరు. మీరు గర్వించాలి.

 

వారిద్దరు చూపిన మార్గం ప్రపంచానికి సూర్ఫి...

మహాత్మాగాంధీ తన రాజకీయాలకు ఆలోచనారూపం ఇచ్చింది ఇక్కడే. ఇది సత్యాగ్రహానికి పుట్టినిల్లు. మోహన్‌దాస్‌ను దక్షిణాఫ్రికా మహాత్ముడిగా మార్చింది. దక్షిణాఫ్రికా స్వాతంత్య్ర పోరాటంలో మీలో ఎందరో కథానాయకులు ఉన్నారు. భారత సంస్కృతికి చెందిన గర్వించదగ్గ కుమారులు, కుమార్తెలు మీరు. కష్టించి పనిచేసే మీరు దక్షిణాఫ్రికాకు విధేయులైన పౌరులు. వృద్ధి చెందుతున్న ప్రపంచ భారత కుటుంబంలో కూడా మీరు భాగం. దక్షిణాఫ్రికా ఒక పవిత్ర భూమి. ఇది మండేలా భూమి. మహాత్మా గాంధీ కర్మభూమి. ఈ ఇద్దరు మహానుభావులు మనకు చూపిన మార్గం, మన కోసం వార గెలిచిన స్వాతంత్య్రం.. మొత్తం మానవజాతికి స్ఫూర్తి. 1914 జూలైలో మహత్మా గాంధీ దక్షిణాఫ్రికాకు వీడ్కోలు చెప్తూ.. ‘‘ఈ ఉపఖండం నాకు నా మాతృభూమి తర్వాత ఒక పవిత్రమైన, ప్రియమైన భూమిగా మారింది. బరువైన గుండెతో దక్షిణాఫ్రికా తీరాన్ని నేను వదిలి వెళ్తున్నా. ఇప్పుడు నన్ను దక్షిణాఫ్రికా నుంచి వేరు చేయనున్న ఈ దూరం.. నన్ను ఈ దేశానికి మరింత దగ్గర చేస్తుంది. ఈ దేశ సంక్షేమం నా ఆలోచనల్లో ఎల్లప్పుడూ ప్రధానంగా ఉంటుంది’’ అని పేర్కొన్నారు.

 

భారత్ ఒక ఉజ్వల కేంద్రం...

ప్రపంచ ఆర్థికవ్యవస్థలో భారతదేశం ఒక ఉజ్వల కేంద్రం. తగ్గిపోతున్న వృద్ధి రేట్లు, ఆర్థిక మందగమనంతో ఉన్న ప్రపంచంలో భారతదేశం ఈ ఏడాది ఆరోగ్యవంతమైన 7.6 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది. ముందటి సంవత్సరాల్లో 8 శాతం అంతకన్నా ఎక్కువగా వృద్ధి చెందటం కోసం మేం పనిచేస్తున్నాం. భారతదేశపు చలనశీలత పటిష్ట చర్యల ద్వారా సాగుతోంది. డిజిటల్ విప్లవాన్ని కూడా మేం ఒక రూపం ఇస్తున్నాం. ప్రభుత్వం తన పౌరులతో వ్యవహరించే తీరును మార్చేసే విప్లవం ఇది. డిజిటల్ మౌలికవసతులపై ఆధారపడే విప్లవం ఇది. ఇది సమాచారం, ఆలోచనలు స్వేచ్ఛగా సంచరించేందుకు వీలు కల్పిస్తుంది.

 

యనవి యువదేశాలు...

దక్షిణాఫ్రికా లాగానే భారతదేశం కూడా యువ దేశం. భారతదేశపు ఆర్థికవ్యవస్థను, సమాజానికి ముందుకు తీసుకువెళ్లే చోదకశక్తి మన యువత కావాలని మేం కోరుకుంటున్నాం. 2022 నాటికి దేశంలో 50 కోట్ల కొత్త ఉద్యోగాలు సృష్టించాలన్నది ప్రణాళిక. భారతదేశ పౌరులు ఆశావాదంతో నిండి ఉన్నారు. నేడు.. భారతదేశపు విజయగాథను నాలుగు అక్షరాల్లో చెప్పవచ్చు.. అది హోప్ (ఆశ). హెచ్ అంటే హార్మనీ (సామరస్యం), ఓ అంటే ఆప్టిమిజమ్ (ఆశావాదం), పీ అంటే పొటెన్షియల్ (సామర్థ్యం), ఈ అంటే ఎనర్జీ (శక్తి). భారత్, దక్షిణాఫ్రికాలు రెండిటికీ జనాభాపరంగా భారీ అవకాశాలున్నాయి. మన ఇరు దేశాలకూ యువ జనాభా ఉంది. భారత్‌లో మూడింట రెండు వంతుల ప్రజలు 35 ఏళ్ల లోపు వయసు వారే. ఆఫ్రికా ఖండంలోనూ, దక్షిణాఫ్రికాలోనూ ఇదే పరిస్థితి ఉంది.

 

మనం ఇంకా ఎక్కువ చేయాలి...

మన అభివృద్ధి, వ్యాపార భాగస్వామ్యాలు ఇప్పటికే బాగున్నాయి. కానీ మనం ఇంకా ఎక్కువ చేయాలి. మనం ఉమ్మడిగా కొత్త సంస్థలను, కొత్త నైపుణ్యాలను, నూతన సామాజిక విలువలను సృష్టించగలం. ఆఫ్రికాలోని మన మిత్రుల కోసం మనం ఉమ్మడిగా కొత్త విలువలను సృష్టించగలం. పేదరికం, ఆకలి, పోషకాహార లోపాలపై పోరాటానికి మనం కలిసి పనిచేయగలం. మనం ప్రపంచ సవాళ్ల శకంలో జీవిస్తున్నాం.. ఉగ్రవాదంపై, పైరసీ మీద, ఎయిడ్స్, ఎబోలాల మీద పోరాటం మన కీలక భాగస్వామ్యాల్లోని కొన్ని రంగాలు.

 

మీరు ఇంట్లో కూర్చుని వీసా పొందొచ్చు...

సోదరసోదరీమణులారా! మీ కోసం పునరుజ్జీవిత భారతదేశం ఎదురుచూస్తోంది. ఓసీఐ, పీఓఐ పథకాలను ఒకే పథకంగా చేయటం జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా కోసం మేం ఈ-వీసాను ప్రారంభించాం. ఇప్పుడు మీరు ఇంట్లో కూర్చుని మీ ఈ-మెయిల్‌లో భారత వీసా పొందవచ్చు. అదికూడా ఎటువంటి ఖర్చూ లేకుండా. భారత వారసత్వ సంపదకు, మన ఆచారాలకు, విలువలకు మీరు గవాక్షం. మీరు సాధించే విజయాలు, మీరు అందించే మద్దతులు మమ్మల్నందరినీ గర్వించేలా చేస్తాయి. మిమ్మల్ని కలవటం నాకు లభించిన విశేషావకాశం. మీ మధ్య ఉన్నందుకు నాకు సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. నమస్తే!’’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement