ఉంటే భూముల్లో.. లేదంటే జైల్లో ఉంటాం
వాగొడ్డుగూడెంలో మళ్లీ గిరిజనుల పోడు పోరు
అశ్వారావుపేట రూరల్: ‘ఇరవై ఏళ్లుగా పోడు భూముల్లో సాగు చేసుకొని పొట్ట నింపుకుంటున్నాం.. ఇప్పుడొచ్చి ఈ భూములు సర్కార్‌వి. ఖాళీ చేయాలి.. ప్లాంటేషన్‌లు వేస్తామంటే ఏలా..?’ అని గిరిజనులు ఆదివారం అటవీ, పోలీసు అధికారులను ప్రశ్నించారు. ‘ఉంటే పోడు భూముల్లో ఉంటాం.. లేదంటే జైల్లో ఉంటాం.. భూములను అప్పగించే ప్రసక్తే లేదు’ అని తేల్చి చెప్పారు. ఖమ్మం జిల్లా వాగొడ్డుగూడెం వద్దగల అటవీ భూముల్లో ఏళ్లుగా అదే గ్రామానికి చెందిన కొంతమంది గిరిజనులు పోడు సాగు చేసుకుంటున్నారు.
ఈ భూముల్లో అటవీ శాఖ అధికారులు ప్లాంటేషన్ వేసేందుకు కొద్ది రోజులుగా అభివృద్ధి పనులు చేస్తున్నారు. ఈ భూములు విషయంపై ఇప్పటికే అనేకసార్లు గిరిజనులు, అటవీ అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. అయితే, ఆదివారం అటవీ అధికారులు చేస్తున్న పనులు నిలిపివేయాలని గిరిజనులు గొడవకు దిగడంతో అధికారులు వెనుదిరిగారు.