
పోకిమాన్ ప్రకంపనలు
జకార్తా: జీపీఎస్ బేస్డ్ పోకిమాన్ గో గేమ్ సృష్టిస్తున్న అలజడి అంతా ఇంతా కాదు. కాల్పనిక ప్రపంచానికి రియల్ వరల్డ్ కు ముడిపెడుతూ రూపొందిన క్రేజీ గేమ్ పై ప్రపంచమంతా ఆసక్తి అలుముకుంటోంది. అయితే పోకిమాన్ గో ఎంత క్రేజీ గేమో అంతే ప్రమాదం కూడా అని నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో ఇండోనేషియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విధుల్లో ఉండగా ఈ గేమ్ ఆడడం నిషిధ్దమంటూ పోలీస్, సైనికు విభాగాలకు ఆదేశాలు జారీ చేసింది. సాయుధ దళాలు, పోలీసు సిబ్బంది కర్తవ్య విధి నిర్వహణలో ఉన్నప్పుడు పోకీమాన్ గో ఆడడాన్ని నిషేధించింది. దీంతోపాటుగా జకార్తాలోని రాజధాని కార్యాలయం పరిసర ప్రాంతాల్లో బుధవారం హెచ్చరిక బోర్డులను కూడా పెట్టింది. .. ప్యాలెస్ ప్రాంతంలో పోకీమాన్ ఆట ..వేట నిషిద్ధమని హెచ్చరించింది. ఇది అధ్యక్ష కార్యాలయం.. ప్లే గ్రౌండ్ కాదని కార్యాలయ ప్రెస్ బ్యూరో ఛీప్ బె మాచుముద్దీన్ వ్యాఖ్యానించారు.
కాగా మొబైల్ గేమ్స్ ప్రియులను అమితంగా ఆకట్టుకుంటున్న సరికొత్త ఆట పాకెట్ మాన్ స్టర్ కు కుదించిన రూపమే ఈ పొకేమాన్. వర్చువల్ పొకేమాన్ లను వెతుకుతూ ఈ పొకేబాల్ తో కొట్టి వాటిని సొంతం చేసుకోవడమే ఈ గేమ్ థీమ్. ఫోన్ లో ఈ గేమ్ ఆన్ చేసి ఇంటర్నెట్ కు కనెక్ట్ అయితే చాలు. ఫోన్ లో ఉండే జీపీఎస్ వ్యవస్థ మన లొకేషన్ను గుర్తిస్తుంది. అలాగే మన ఫోన్ లో ఉన్న కెమెరా గేమ్ కు కనెక్ట్ అవుతుంది. తర్వాత చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడెక్కడ పోకెమాన్ లు ఉన్నాయో నోటిఫికేషన్లు వస్తుంటాయి. అవి ఎక్కడైనా ఉండొచ్చు. బాత్ రూమ్, బెడ్ రూమ్, అపార్ట్ మెంట్ కారిడార్, రోడ్డు పక్క, ఆఫీస్ లో, టూరిస్ట్ ప్లేస్ లో ఇలా ఎక్కడైనా ఈ వర్చువల్ జీవులను పసిగట్టొచ్చు. అవి కనింపించిన వెంటనే పొకెబాల్ తో కొట్టి సొంతం చేసుకుంటూ ముందుకు సాగాలి. అపుడుమాత్రమే నెక్స్ట్ లెవల్ కి ప్రమోషన్ ఉంటుంది.
ఈ గేమ్ ను రూపొందించిన నింటెండో సంస్థ అమెరికా, బ్రిటన్, న్యూజిలాండ్ లో అధికారికంగా పొకేమాన్ గేమ్ ను విడుదల చేసింది. అధికారికంగా విడుదల కాకపోయినా భారత్ సహా పలు దేశాల యువతలో పొకేమాన్ మేనియా విపరీతంగా ఉంది. రెండు వారాల క్రితమే లాంచ్ చేసిన పోకెమాన్ గో యూజర్లను ఆకట్టుకుంటూ మార్కెట్ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. దీంతో జపాన్ లోని ఉత్తమ ప్రసిద్ధ కంపెనీల జాబితాలో ఒకటిగా నింటెండో చేరిపోయింది.ఈ క్రేజ్ కేవలం నింటెండో కంపెనీకి మాత్రమే పరిమితం కాలేదు. మొబైల్ గాడ్జెట్స్ లో, స్మార్ట్ ఫోన్లలో దీనికి ఫుల్ క్రేజ్ పెరిగిపోతోంది. . టోక్యోలో ట్రేడ్ అయ్యే ఇతర షేర్లకు ఇది లాభాలను పండిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ బాటలో మరిన్ని దేశాలు కూడా పయనించనున్నాయా? వేచి చూడాలి..