పద్మశ్రీ ఇలియానాపై పోలీసు కేసు
ఒడిసాలో తాను నడుపుతున్న డాన్సు స్కూలులో ఓ విద్యార్థితో దురుసుగా ప్రవర్తించినందుకు ఇలియానాపై పోలీసు కేసు నమోదైంది. ఇటలీలో పుట్టి, ఒడిసీ నృత్యం నేర్చుకుని.. అదే అంశంలో పద్మశ్రీ అవార్డు కూడా స్వీకరించిన ఇలియానా సిటారిస్టి బిందుసాగర్ ప్రాంతంలో డాన్సు స్కూలు నడిపిస్తున్నారు. తన పదేళ్ల కుమార్తె దివ్యరూప అక్కడ డాన్సు నేర్చుకుంటోందని, ఆమెపై ఇలియానా దురుసుగా ప్రవర్తించారని బాధితురాలి తండ్రి కమల కాంత దాస్ ఆదివారం నాడు భువనేశ్వర్లోని లింగరాజ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు మాత్రం మంగళవారం రాత్రే ఆ కేసు నమోదు చేసుకున్నారు.
అయితే.. బాధితురాలి తండ్రి మాత్రం ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇచ్చేందుకు నిరాకరించారు. మరోవైపు ఇలియానా కూడా తనపై చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని, నిరాధారమని అంటున్నారు. తాను ఆ పాపను కొట్టడం గానీ, తిట్టడం గానీ ఏమీ చేయలేదని చెబుతున్నారు. 'ఆర్ట్ విజన్ అకాడమీ' అనే తన డాన్సు స్కూల్లో 40 మందికి ఆమె డాన్సు నేర్పుతున్నారు. పోలీసులు మాత్రం ఆమెపై ఐపీసీ సెక్షన్లు 341, 323, బాలల చట్టంలోని సెక్షన్ 23 కింద కేసులు నమోదుచేశారు. బాలికకు వైద్య పరీక్షలు చేయించాము గానీ, ఆమెకు ఎలాంటి గాయాలు కాలేనట్లు తెలిసిందని డీసీసీ నితిన్జీత్ సింగ్ తెలిపారు.