ఎలక్ట్రికల్ ఇంజనీర్.. హ్యాట్రిక్ సీఎం
బిహార్లో నితీష్ కుమార్ హ్యాట్రిక్ సీఎం కానున్నారు. నూతన ముఖ్యమంత్రిగా మళ్లీ నితీష్ కుమారే పగ్గాలు చేపట్టనున్నారు. కాంగ్రెస్, ఆర్జేడీ మద్దతుతో ఆయన తిరిగి సింహాసనం చేజిక్కించుకున్నారు.
2000 సంవత్సరం మార్చి3వ తేదీన మొదటిసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన నితీష్ కుమార్.. తన మెజార్టీని నిరూపించుకోలేక పోవడంతో కేవలం ఏడురోజుల్లోనే పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత 2005 నవంబరులో తిరిగి సీఎం పగ్గాలు చేపట్టిన ఆయన.. బీహార్ రాష్ట్ర ప్రజల ఆదరాభిమానాలను చూరగొంటూ... నేటికీ సీఎంగా కొనసాగుతున్నారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి విజయం సాధించడంతో నితీష్ తిరిగి ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కనున్నారు. 2005, నవంబర్ నెలలో లాలూ ప్రసాద్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ 15 సంవత్సరాల పాలనకు ముగింపు పలుకుతూ బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ- జేడీ(యూ)లతో కూడిన ఎన్డీయే కూటమి విజయం సాధించింది. 2005 నవంబర్ 24న బిహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. అనేక నూతన పథకాలను ప్రవేశపెట్టి, రాష్ట్రాభివృద్ధికి పాటుపడ్డారు. రాష్ట్రంలో తగ్గిన అభివృద్ధి, పెరిగిన నేర తీవ్రతలను ముఖ్య సమస్యలుగా భావించిన ఆయన.. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా సమస్య పరిష్కారానికి ప్రత్యేకచర్యలు తీసుకున్నారు. అన్ని జిల్లా మేజిస్ట్రేట్లతో వారాంతపు సమావేశాలు నిర్వహించి.. ప్రాధమిక స్థాయి నుంచి పురోగతిని సాధించేందుకు నిర్మాణాత్మక కార్యకలాపాలకు రూపకల్పన చేశారు. ఐదేళ్ల సమయంలో కేంద్రంలోనే రికార్డు స్థాయిలో పనులను చేపట్టారు.
నితీష్ కుమార్ ప్రభుత్వం.. ప్రత్యేకంగా సైకిళ్లు, భోజన కార్యక్రమాలను ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా సగటున బాలికల డ్రాపవుట్స్ రేటు తీవ్రంగా పెరిగిపోతుండటంతో పాఠశాలలో చవివే బాలికలకు సైకిళ్ల పంపిణీ, భోజన సదుపాయాలను ప్రారంభించారు. మహిళలు, వెనుకబడిన కులాలకు దేశంలోనే తొలిసారి 50 శాతం రిజర్వేషన్లను కల్పించారు. అయితే సైకిళ్ల పథకంలో భారీగా అవినీతి చోటుచేసుకున్నట్లు అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. గ్రామాల్లోని ఆస్పత్రుల్లో హెల్త్ స్కీములను ప్రవేశపెట్టి మందులు ఉచిత పంపిణీ చేసే పద్ధతిని నితీష్ అమలులోకి తెచ్చారు. నితీష్ ప్రభుత్వంలో జీఎస్ డీపీ అభివృద్ధిలో బీహార్ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది.
మూడోసారి 2010 నవంబర్ 26న అధికారంలోకి వచ్చిన నితీష్ కుమార్ పార్టీ... దాని మిత్రపక్షం బీజేపీతో కలిసి అధికారాన్ని కైవసం చేసుకుంది. నవంబర్ 26న ప్రమాణం స్వీకరించిన నితీష్.. ఐదింట నాలుగు వంతుల మెజారిటీతో విజయం సాధించారు. ఆ తర్వాత పరిణామాల్లో భాగంగా ఎన్డీయే నుంచి విడిపోయి 17 ఏళ్ల పాటు కేంద్ర రాజకీయాల్లో అత్యంత సన్నిహితంగా ఉన్న బీజేపీకి కటీఫ్ చెప్పేశారు.
1951 మార్చి 1న జన్మించిన నితీష్ కుమార్ కేంద్రమంత్రిగా పనిచేశారు. కవిరాజ్ రామ్ లఖన్ సింగ్, పరమేశ్వరీ దేవి ఆయన తల్లిదండ్రులు. తండ్రి స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది. బిహార్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్లో పట్టభద్రుడైన నితీష్ కుమార్.. బిహార్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డులో అయిష్టంగానే ఉద్యోగానికి చేరారు. ఆ తర్వాత తనకిష్టమైన రాజకీయాల్లోకి అడుగు పెట్టారు.