భారత్ చెప్పిందే.. పాక్ చీఫ్ జస్టిస్ చెప్పారు
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని భారత్ ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది. అంతర్జాతీయ వేదికలపై ఈ విషయాన్ని ప్రస్తావించింది. పాకిస్థాన్ చీఫ్ జస్టిస్ అన్వర్ జహీర్ జమాలీ కూడా ఇప్పుడు ఇదే మాట చెప్పారు. పాక్లోని కొన్ని రాజకీయ పార్టీలు ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో ఇన్నాళ్లూ భారత్ చేస్తున్న వ్యాఖ్యలను సాక్షాత్తూ పాక్ చీఫ్ జస్టిస్ సమర్థించినట్టయ్యింది. ఇస్లామాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
సొంత ప్రయోజనాల కోసం కొన్ని రాజకీయ పార్టీలు ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వడం దురదృష్టకరమని జమాలీ వ్యాఖ్యానించారు. పాకిస్థాన్లో జడ్జిలను, న్యాయవాదులను భయపెట్టేందుకు ఉగ్రవాదులు కోర్టులను లక్ష్యంగా చేసుకున్నారని చెప్పారు. దేశంలో ఉగ్రవాదం పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో స్థిరత్వాన్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే దేశంలో ఎక్కడా మతవిద్వేషాలకు తావులేకుండా చూడాలని జమాలీ చెప్పారు.