రాజకీయాలపై ‘పెద్దాయన’ నిర్వేదం
ముంబై: సమకాలిన రాజకీయాలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని నేషలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ వ్యాఖ్యానించారు. దేశ రాజకీయాల్లో దుష్ట పరిణామాలు పెరిగిపోతున్నాయని నిర్వేదం వ్యక్తం చేశారు. శనివారం ఆయన ఎన్సీపీ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంతో దేశానికి ఒరిగిందేమీ లేదని అన్నారు. మూడేళ్ల బీజేపీ పాలనలో ఆర్థిక, వ్యవసాయ రంగాల వృద్ధి క్షీణించిందని తెలిపారు. పెట్టుబడులు మందగించాయని, ఉపాధి కల్పన కనీస స్థాయిలో కూడా లేదని విమర్శించారు.
కాగా, మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీని పవార్ కలిశారు. మహారాష్ట్ర రైతుల వ్యవసాయ రుణాలు మాఫీ చేయాలని ప్రధానమంత్రిని కోరారు. అంతకుముందు రాష్ట్రపతి అభ్యర్థిగా శరద్ పవార్ పేరును శివసేన తెరపైకి తెచ్చింది. అయితే రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం తనకు లేదని, అందుకు వేరే వ్యక్తిని చూసుకోవాలని పవార్ కోరడంతో శివసేన వెనక్కు తగ్గింది.