ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. అయితే చలి బాగా ఎక్కువగా ఉండటంతో పోలింగ్ ఉదయం మందకొడిగా ప్రారంభమైనా, క్రమంగా ఊపందుకుంటోంది. ఇక్కడ ఉన్న మొత్తం 70 సీట్లకు గాను బరిలో 810 మంది అభ్యర్ధులున్నారు. ఢిల్లీలో మొత్తం ఓటర్ల సంఖ్య 1.19 కోట్లు. మిగిలిన అన్ని రాష్ట్రాల కంటే ఢిల్లీలోనే పోలింగ్ శాతం ఎక్కువగా ఉంటుందని ఎన్నికల అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. ఇంతకుముందు మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో రికార్డు పోలింగ్ నమోదైన విషయం తెలిసిందే. ఢిల్లీ దీన్ని తలదన్నుతుందని అంటున్నారు.
ఇక్కడ తొలిసారి త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్, బీజేపీలతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా రంగంలో ఉంది. చీపురుకట్ట గుర్తుతో అరవింద్ కేజ్రీవాల్ బృందం జోరుగానే ప్రచారం చేసింది. ఈసారి ఇక్కడ హంగ్ అసెంబ్లీ ఏర్పాటు కావచ్చని, మూడు పార్టీలకూ దాదాపు సమాన స్థాయిలోనే సీట్లు రావచ్చని సర్వేలు అంచనా వేశాయి. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ముందుగానే తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ తర్వాత బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి హర్షవర్ధన్ కూడా ఓటు వేశారు. సోనియాగాంధీ, సుష్మా స్వరాజ్ సహా పలువురు ప్రముఖులు ఈ ఎన్నికలలో ఓట్లు వేయనున్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
Published Wed, Dec 4 2013 9:44 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM
Advertisement
Advertisement