వాళ్లు కనిపిస్తే తల నరికేయండి!
- హిజ్రాలపై వివాదాస్పద పోస్టర్లు
కరాచీ: హిజ్రాలు కనిపిస్తే తల నరికేయాలంటూ పాకిస్థాన్ ఆర్థిక రాజధాని కరాచీలో వెలిసిన వివాదాస్పద పోస్టర్లు పెద్ద దుమారం రేపుతున్నాయి. కరాచీలో నిత్యం రద్దీగా ఉండే ప్రముఖ వాణిజ్య ప్రాంతంలో ఈ పోస్టర్లు పెద్దసంఖ్యలో అంటించి ఉండటంతో పోలీసులు రంగంలోకి దిగి అలర్ట్ ప్రకటించారు. పాకిస్థాన్‌లో ఇటీవలికాలంలో అసహనం, ఉగ్రవాదం పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఏకంగా షాపింగ్ మాల్స్ లోపల ఈ తరహా పోస్టర్లు వెలువడం హిజ్రాలను కలవరానికి గురిచేస్తున్నది. పొట్టపోసుకునేందుకు హిజ్రాలు నిత్యం ఈ ప్రాంతంలో తిరుగుతూ భిక్షాటన చేస్తుంటారు.
ఈ నేపథ్యంలో హిజ్రాలపై ఎలాంటి దాడులు జరగకుండా అలర్ట్ ప్రకటించామని, ఎవరైనా తమ ప్రాణాలకు ముప్పు ఉంచి ఉందని భావిస్తే పోలీసుల రక్షణ కోరవచ్చునని స్థానిక పోలీసు అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు ఈ పోస్టర్లు వెలిసినప్పటి నుంచి ఈ ప్రాంతంలో హిజ్రాలు ఎవరూ కనిపించడం లేదని, వారి సంచారం తగ్గిందని స్థానిక షాపింగ్ మాల్ వద్ద పనిచేసే ఓ సెక్యూరిటీ గార్డు చెప్పారు. హిజ్రాలు తమ వ్యాపారాలకు అడ్డు తగులుతూ చికాకు కలిగిస్తున్నారనే ఉద్దేశంతో స్థానిక దుకాణాల యజమానులే ఈ పోస్టర్లు అంటించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు పోస్టర్లను సమర్థిస్తున్న వ్యాపారులు.. పురుషులే హిజ్రాల వేషం వేసుకొని మహిళలను తాకుతూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, వారి వద్ద అడుక్కుంటూ చికాకు కల్పిస్తున్నారని, ఇలాంటివి సాగనివ్వమని అంటున్నారు.