ప్రభాస్‌కు 6వేల మ్యారేజ్ ప్రపోజల్స్!
‘బాహుబలి’సినిమాలతో ప్రభాస్ ఒక్కసారిగా జాతీయ సూపర్ స్టార్‌గా మారిపోయారు. ఒకప్పుడు టాలీవుడ్‌కు మాత్రమే పరిమితమైన ఆయన ఛరిష్మా ఇప్పుడు దేశమంతటా మారుమోగుతోంది. అతన్ని జాతీయ స్టార్‌గా నేషనల్ మీడియా ఆకాశానికెత్తుతుండగా.. ప్రభాస్ మాత్రం విన్రమంగా తాను అంతటి స్టార్‌ను కాదని అంటున్నాడు. మరోవైపు ప్రభాస్ గురించి, అతని సినీ కెరీర్ గురించి, ఇష్టాయిష్టాల గురించి పలు ఆసక్తికర కథనాలు జాతీయ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రభాస్‌కు అక్షరాల ఆరువేల మ్యారేజ్ ప్రపోజల్స్ వచ్చాయట. కానీ బాహుబలి ప్రాజెక్టు మీద ఫోకస్ కొనసాగించేందుకు ఈ ప్రతిపాదనలన్నింటినీ డార్లింగ్ వదిలేసుకున్నాడని తాజాగా ఓ జాతీయ మీడియా సంస్థ తెలిపింది.
ఇక, ‘బాహుబలి-2’ షూటింగ్ సందర్భంగా ఓ సంస్థకు ప్రచారకర్తగా ఉండాలంటూ రూ. 10 కోట్ల ఆఫర్ ప్రభాస్‌కు వచ్చింది. కానీ బాహుబలి నుంచి దృష్టి మళ్లించడం ఇష్టంలేని ప్రభాస్ ఆ ఆఫర్‌ను నిర్ద్వంద్వంగా తిరస్కరించాడు. అంతేకాదు ‘బాహుబలి’ షూటింగ్ సమయంలో వచ్చిన పలు బాలీవుడ్ ఆఫర్లను సైతం అతను సున్నితంగా తిరస్కరించాడు. అది ఆయన అంకితభావానికి నిదర్శనం. ఇక ప్రభాస్‌కు కొంచెం సిగ్గు ఎక్కువ. ఆడంబరాలకు దూరంగా లో-ప్రొఫైల్ మెయింటెన్ చేస్తాడు. అతను మంచి ప్రకృతి ప్రేమికుడు. పుస్తకాలు ఎక్కువగా చదువుతాడు. వృత్తిపట్ల నిబద్ధత ఎక్కువ. బాహుబలి సినిమాలో శివుడి పాత్ర కోసం 82 కిలోల నుంచి 87 కిలోల వరకు బరువు పెరిగిన ప్రభాస్.. అదే బాహుబలి కోసం105 కేజీల వరకు బరువు పెరిగాడు. బాహుబలి ప్రాజెక్టు కోసం ప్రభాస్ దాదాపు ఐదేళ్లు కేటాయించాడు. 600 రోజులు షూటింగ్ లో పాల్గొన్నాడు.