
ఎప్పుడైనా వస్తా!
- ఉద్యమ పాటగానే కొనసాగుతా
- రాజకీయ ప్రవేశాన్ని భవిష్యత్తే నిర్ణయిస్తుంది: గద్దర్
- వరంగల్ ఎంపీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా కోరిన లెఫ్ట్ నేతలు
సాక్షి, హైదరాబాద్: ‘‘ప్రజలు కోరితే ఎప్పుడైనా వస్తా.. అది రేపైనా కావొచ్చు లేదా ఎల్లుండైనా కావొచ్చు.. పదేళ్లయినా కావొ చ్చు’’ అని ప్రజాగాయకుడు గద్దర్ అన్నారు. ‘‘నేను ఉద్యమపాట గానే కొనసాగుతా. రాజకీయాల్లోకి వచ్చే అంశంపై ఇప్పుడే చెప్పలేను. రాజకీయరంగ ప్రవేశాన్ని భవిష్యతే నిర్ణయిస్తుంది. ప్రజాభిప్రాయం మేరకు భవిష్యత్‌లో నిర్ణయం తీసుకుంటాను’’ అని వెల్లడించారు. వరంగల్ ఎంపీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో వివిధ వామపక్షాల తరఫున పోటీ చేయాలని ఆ పార్టీల నాయకులు కోరారని ఆయన మీడియాకు తెలిపారు.
మంగళవారం రాత్రి గద్దర్‌ను ఆయన నివాసంలో కలిసి వామపక్షాల నాయకులు... వరంగల్ నుంచి పోటీ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ‘‘వామపక్ష నేతలందరూ కలసి వచ్చారు. పోటీపై ఆలోచిస్తా.. రేపు రావొచ్చు, ఎల్లుండి రావొచ్చు... వామపక్షాల తరఫున వరంగల్ ఎంపీ సీటుకు అభ్యర్థిగా ఎవరిని పెట్టినా ప్రచారం చేయడానికి సిద్ధం’’ అని గద్దర్ స్పష్టం చేశారు. గద్దర్‌ను కలిసినవారిలో చాడ వెంకటరెడ్డి (సీపీఐ), తమ్మినేని వీరభద్రం(సీపీఎం), వేములపల్లి వెంకటరామ య్య, రమ (న్యూడెమోక్రసీ-రాయల), ఎండీ గౌస్ (ఎంసీపీఐ-యూ), జానకి రాములు, గోవింద్ (ఆర్‌ఎస్‌పీ), బండ సురేందర్‌రెడ్డి (ఫార్వర్డ్‌బ్లాక్), మురహరి (ఎస్‌యూసీఐ-సీ) ఉన్నారు. వారు మాట్లాడుతూ... వరంగల్ ఎంపీ సీటుకు గద్దర్‌ను పోటీ చేయాలని కోరుతున్నామన్నారు.
లిక్కర్‌పై ఉద్యమం: గద్దర్‌ను కలిసేందుకు ముందు లెఫ్ట్ నేతలు మఖ్దూంభవన్‌లో సమావేశమయ్యారు. ఈ ఏడు పార్టీల నాయకులతో పాటు కె.గోవర్ధన్(న్యూడెమోక్రసీ-చంద్రన్న), భూతం వీరయ్య (సీపీఐ-ఎంఎల్) ఇందులో పాల్గొన్నారు. ఎన్నికల్లో పోటీ చేయాల్సిందిగా గద్దర్‌ను కోరేందుకు తాము రాలేమని గోవర్ధన్ స్పష్టం చేసినట్లు సమాచారం. బుధవారం జరగనున్న సార్వత్రిక సమ్మెకు మద్దతు తెలుపుతూనే పార్టీలుగా కాకుండా కార్మిక సంఘాలుగా పాల్గొనాలని, చీప్ లిక్కర్‌కు వ్యతిరేకంగా ఉద్యమించాలని ఈ భేటీలో నిర్ణయించారు.
ఈ నెల 17న హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని సీపీఐ, సీపీఎం, ఆర్‌ఎస్‌పీ, ఫార్వర్డ్‌బ్లాక్, ఎంసీపీఐ-యూ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 10న చాకలి ఐలమ్మ వర్థంతి సందర్భంగా వరంగల్ జిల్లా పాలకుర్తిలో ఆమె విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి సీపీఎం నేత బృందా కారత్ హాజరు కానున్నారు. వరంగల్ ఉప ఎన్నికల్లో గద్దర్ అభ్యర్థి కాకపోతే, వామపక్షాల తరఫున సీపీఐ నేత గుండా మల్లేష్ లేదా సీపీఎం నేత జాన్‌వెస్లీలను పోటీకి నిలపాలని ఆర్‌ఎస్‌పీ, ఫార్వర్డ్‌బ్లాక్, సీపీఐ (ఎంఎల్) నాయకులు సూచించారు.
పోటీకి విముఖత!
వామపక్షాల నాయకులతో అంతర్గత భేటీలో వరంగల్ ఎంపీ సీటుకు పోటీపై గద్దర్ విముఖత వ్యక ్తం చేసినట్లు సమాచారం. కొన్ని సందర్భాల్లో అధికార పార్టీ తన పట్ల వ్యవహరించిన తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. తనకు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని గద్దర్ పేర్కొనట్లు సమాచారం. కాంగ్రెస్‌తో సహా ఇతర ప్రతిపక్షాలు కూడా బలపరిచేలా చూస్తామని వామపక్ష నాయకులు సూచించగా.. వామపక్షాలు ఎవరిని పెట్టినా గెలుపు సాధ్యమేనని, భవిష్యత్ ఎర్రజెండాదేనని, రాబోయే రోజులు ప్రజలవేనని గద్దర్ అన్నట్లు తెలిసింది.