రాష్ట్రపతి ఎన్నికలు; బీజేపీ కీలక కమిటీ
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో మిత్రుల మద్దతు కూడగట్టేందుకు బీజేపీ వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ విషయమై ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో చర్చలు జరిపేందుకుగానూ సోమవారం త్రిసభ్య కమిటీని ఏర్పాటుచేసింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సోమవారం ఒక ప్రకటన చేశారు.
కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అరుణ్‌జైట్లీ, వెంకయ్య నాయుడు సభ్యులుగా కమిటీని ఏర్పాటుచేసినట్లు, రాష్ట్రపతి ఎన్నికల విషయమై ఈ కమిటీ భాగస్వామ్య పక్షాతలో చర్చలు జరపనున్నట్లు అమిత్ షా వెల్లడించారు. రాష్ట్రపతి అభ్యర్థి ఎవరనే విషయాన్ని బీజేపీ ఇంకా వెల్లడించలేదు. ఆయా పార్టీలతో త్రిసభ్య కమిటీ చర్చల తర్వాతే అభ్యర్థిని ప్రకటిస్తారన్నది సుస్పష్టం.
ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 14న రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఆ రోజు నుంచే నామినేషన్లు స్వీకరిస్తారు. జూలై 17న పోలింగ్, 20న కౌంటింగ్ నిర్వహించనున్నారు.
ఎన్నికల్లో ఎవరి బలమెంత?
ఎన్డీయేలోని మిత్రపక్షాలు, మద్దతునిస్తున్న ఇతర చిన్నాచితక పార్టీలతో కలుపుకొంటే అధికార బీజేపీకి ఇప్పుడు ఎలక్టోరల్ కాలేజీలో 48.64 శాతం ఓట్లున్నాయి. యూపీఏ, బీజేపీ వ్యతిరేక పార్టీలను కలుపుకొని ఉమ్మడి అభ్యర్థిని నిలబెడితే వీరికి 35.47 శాతం ఓట్లున్నాయి. మరో ఆరు ప్రాంతీయపార్టీలైన అన్నాడీఎంకే, బీజేడీ, టీఆర్‌ఎస్, వైఎస్సార్‌సీపీ, ఆప్, ఐఎన్‌ఎల్‌డీలు తమ రాష్ట్ర రాజకీయ అవసరాల దృష్ట్యా బీజేపీ, కాంగ్రెస్‌లకు సమదూరం పాటిస్తూ తటస్థంగా వ్యవహరిస్తున్నాయి. బీజేపీ అభ్యర్థే గెలిచే అవకాశమున్నపుడు మరో అభ్యర్థిని పెట్టడం ఎందుకని, రాష్ట్రపతి, స్పీకర్ లాంటి పదవులకు ఎన్నిక ఏకగ్రీవమవ్వాలని.. దీనిపై చర్చ జరగాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. వైఎస్సార్‌సీపీ ఎలక్టోరల్ ఓట్ల శాతం 1.53గా ఉంది. బీజేపీ శిబిరానికి ఇప్పుడున్న బలానికి (48.64 శాతం) వైఎస్సార్‌సీపీ కలిస్తే వారి అభ్యర్థికి 50.17 శాతం ఎలక్టోరల్ కాలేజీ మద్దతు ఉన్నట్లే. అన్నాడీఎంకే, టీఆర్‌ఎస్ కూడా ఎన్‌డీఏ అభ్యర్థికే మద్దతిచ్చే అవకాశాలెక్కువ.
(చదవండి: జూలై 17న రాష్ట్రపతి ఎన్నిక)