నవభారతంలో పేదరికానికి తావు లేదు: రాష్ట్రపతి
- ప్రభుత్వ సంకల్పం ఒక్కటే సరిపోదు.. ప్రజల భాగస్వామ్యమూ కావాలి
- తొలి స్వాతంత్ర్యదినోత్సవ సందేశంలో రామ్‌నాథ్ కోవింద్
న్యూఢిల్లీ: నవభారత నిర్మాణానికి ప్రభుత్వాల సంకల్పం ఒక్కటే సరిపోదని, దానికి ప్రజల మద్దతు కూడా ఎంతో అవసరమని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. ప్రజలే అసలైన నవభారత నిర్మాతలని ఉద్ఘాటించారు.
స్వాతంత్ర్యదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన సోమవారం రాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. స్వాతంత్ర్య పోరాటంలో అమరులైన వీరుల త్యాగాలు వెలకట్టలేనివని, వారి త్యాగనిరతి చిరస్మరణీయమని కోవింద్ గుర్తుచేశారు.
పేదరికానికి తావు లేదు
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛభారత్, నోట్లరద్దు ప్రక్రియ, జీఎస్టీ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు ప్రజలు సుహృదయంతో అంగీకారం తెలిపారని రాష్ట్రపతి కోవింద్ అన్నారు. సకాలంలో పన్నుల చెల్లించడాన్ని ప్రతిఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని, తద్వారానే నవభారత నిర్మాణం జరుగుతుందని, ఆ మేరకు అందరమూ ప్రతిజ్ఞచేయాల్సిన అవసరం ఉందని కోవింద్ అన్నారు. నవభారతంలో పేదరికానికి తావు ఉండదని చెప్పారు. మహిళలు, దివ్యాంగులపట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు.