ఆగిన భూచట్టం! | President yet to approve new land acquisition Act of Telangana | Sakshi
Sakshi News home page

ఆగిన భూచట్టం!

Published Mon, Feb 27 2017 1:50 AM | Last Updated on Wed, Aug 8 2018 6:12 PM

ఆగిన భూచట్టం! - Sakshi

ఆగిన భూచట్టం!

- ఆమోదానికి ఇంకా నోచుకోని సవరణ బిల్లు
- కేంద్ర భూసేకరణ చట్టానికి సవరణలు చేస్తూ డిసెంబర్‌లోనే ఢిల్లీకి పంపిన అసెంబ్లీ
- వివిధ అంశాలపై ఇప్పటికే వివరణ ఇచ్చిన రాష్ట్ర సర్కారు
- పలు రాష్ట్రాల బిల్లుల ఆమోదంపై సుప్రీంలో పిటిషన్లు.. అందుకే రాష్ట్రపతి కాలయాపన!
- ప్రత్యామ్నాయంగా వరుస జీవోలు జారీ చేస్తున్న ప్రభుత్వం


సాక్షి, హైదరాబాద్‌

కేంద్ర భూసేకరణ చట్టానికి సవరణ చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన బిల్లు హస్తినలోనే ఆగిపోయింది! రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే ఈ బిల్లు చట్టంగా మారుతుందని, ప్రాజెక్టుల భూసేకరణ వేగవంతం అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఆశలు పెట్టుకుంది. కానీ రెండు నెలలు కావొస్తున్నా బిల్లుపై రాష్ట్రపతి ఆమోద ముద్ర పడకపోవటంతో ప్రభుత్వం తలపట్టుకుంటోంది.

గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా డిసెంబర్‌ 28న ఈ బిల్లును శాసనసభ ఆమోదించింది. కేంద్ర హోంశాఖ ద్వారా రాష్ట్రపతికి పంపించింది. జనవరిలోనే హోంశాఖ నుంచి ఈ బిల్లు రాష్ట్రపతి భవన్‌కు చేరినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఫిబ్రవరి రెండో వారంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఢిల్లీకి వెళ్లిన సందర్భంలోనూ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీతో భేటీ అయ్యారు. ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలకు ఆహ్వానించారు. అదే సమయంలో రాష్ట్రంలో ఉన్న అవసరాల దృష్ట్యా ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసేందుకు భూసేకరణ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ఈలోగా రాష్ట్రపతి స్పష్టత కోరిన పలు అంశాలపై కేంద్ర హోం శాఖ రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరినట్లు తెలిసింది. న్యాయ నిపుణులతో సంప్రదించిన రాష్ట్ర ప్రభుత్వం రెండు వారాల కిందటే వివరణలు కూడా పంపింది.

ఈలోగా విపక్ష పార్టీలు సైతం కేంద్రం చట్టానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన సవరణలను ఆమోదించవద్దని కోరుతూ రాష్ట్రపతికి ఫిర్యాదులు చేశాయి. దీంతో ఈ బిల్లు ఆమోదం పొందుతుందా.. లేదా.. అన్న సందేహాలు ప్రభుత్వ వర్గాలను వెంటాడుతున్నాయి. ఇప్పటికే గుజరాత్, రాజస్తాన్‌తోపాటు పలు రాష్ట్రాలు భూసేకరణ చట్టానికి సవరణ చేసిన బిల్లులను రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. అదే ధీమాతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గ్రీన్‌సిగ్నల్‌తోనే తెలంగాణ ప్రభుత్వం ఈ బిల్లును పంపింది. కానీ కేంద్ర చట్టానికి గుజరాత్, రాజస్తాన్‌ రాష్ట్రాలు చేసిన సవరణలపై కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పంపించిన బిల్లుపై రాష్ట్రపతి కాలాయాపన చేస్తున్నారనే అభిప్రాయాలు అధికార వర్గాల్లో వినిపిస్తున్నాయి.

ప్రత్యామ్నాయాలకు జీవోలే దిక్కు
రాష్ట్రపతి ఆమోదముద్రకు ముందే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది. 2013 కేంద్ర భూసేకరణ చట్టానికి బదులుగా ప్రాజెక్టుల భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు జీవోలు జారీ చేసింది. కొందరు నిర్వాసితులు హైకోర్టుకెక్కటంతో ఇవన్నీ వివాదాస్పదమయ్యాయి. దీంతో ఎప్పటికప్పుడు చిక్కులు అధిగమించేందుకు ప్రభుత్వం కొత్త జీవోలు జారీ చేస్తోంది. ప్రజావసరాల కోసం భూమిని సేకరించేందుకు... 2015 జూలై 30న జీవో 123 జారీ చేసింది. ఈ భూసేకరణ వల్ల ప్రభావితమయ్యే కుటుంబాలకు ప్రయోజనాలు కల్పిస్తూ గతేడాది ఆగస్టు 10న జీవో 190, అదే నెల 15న జీవో 191ను జారీ చేసింది. జీవో 123ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌లపై విచారించిన హైకోర్టు.. గత నెల 5న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అధికరణ 298 ప్రకారం భూమిని విక్రయించే వారితో ఒప్పందం చేసుకునే అధికారం ఉన్నప్పటికీ.. కేంద్ర భూసేకరణ చట్టంలోని 2, 3 షెడ్యూళ్ల కింద పునరావాస, పునర్నిర్మాణ ప్రయోజనాలు కల్పించకుండా ఒప్పందం చేసుకోవడానికి వీల్లేదని కోర్టు స్పష్టంచేసింది.

కేంద్ర చట్టానికి అనుగుణంగా అథారిటీ
ఇప్పటివరకు కేంద్ర భూసేకరణ చట్టాన్ని పట్టించుకోని ప్రభుత్వం ఇటీవల రూటు మార్చింది. రాష్ట్రపతి వద్ద బిల్లు ఆలస్యమైన కొద్దీ ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది. భూసేకరణ లక్ష్యంతోపాటు కోర్టు కేసుల నుంచి గట్టెక్కేందుకు వరుసగా మరో రెండు జీవోలు జారీ చేసింది. హైకోర్టు విచారణ నుంచి గట్టెక్కేందుకు హడావుడిగా ఫిబ్రవరి 14న రాత్రికి రాత్రే కొత్త జీవో తీసుకొచ్చింది. భూమి యజమానులు కాకుండా ప్రభావితులైన ఇతరులకు పునరావాస, పునర్నిర్మాణ చర్యలను సూచిస్తూ జీవో నెం.38 జారీ చేసింది. తాజాగా అథారిటీని కూడా ఏర్పాటు చేసింది. కేంద్ర చట్టంలో నిర్దేశించిన విధంగా ఈ నెల 22న భూసేకరణ, పునరావాసం, పునర్నిర్మాణ అథారిటీని ఏర్పాటు చేసింది. రిటైర్డ్‌ జడ్జి బి.నాగమారుతి శర్మను ప్రిసైడింగ్‌ అధికారిగా నియమించింది. రాష్ట్రపతికి పంపిన బిల్లు ఆమోదంపై ఉన్న సందేహాలతోనే ప్రభుత్వం ఇలా వరుసగా చర్యలు తీసుకుంటోందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

123 జీవో చెబుతోంది ఇదీ..
జీవో 123 ప్రకారం.. ప్రజోపయోగ పనులకు సేకరించే భూముల సేకరణను రాష్ట్ర ప్రభుత్వం సులభతరం చేసుకుంది. భూములను విక్రయించేందుకు ముందుకు వచ్చే వారితో ప్రభుత్వం నేరుగా ఒప్పందం చేసుకుంటుంది. జిల్లా కలెక్టర్‌ అధ్వర్యంలోని కమిటీ నిర్వాసితులతో ముఖాముఖి బేరసారాలు జరిపి ధరను నిర్ణయించుకొని కొనుగోలు ఒప్పందం చేసుకుంటుంది. అంత మేరకు డబ్బులు చెల్లించి ప్రభుత్వం ఆ భూములు, స్థిరాస్తులను సొంతం చేసుకుంటుంది. కేంద్ర భూసేకరణ చట్టంలో పొందుపరిచిన నిర్దిష్ట ప్రణాళిక, గ్రామ సభలు, పునరావాస, పునర్నిర్మాణ ప్రయోజనాలేవీ ఇందులో లేవు.

2013 కేంద్ర భూసేకరణ చట్టంలో ఏముందంటే..?
భూసేకరణ ప్రక్రియలో ప్రతి చర్యకు నిర్ణీత గడువును నిర్దేశించారు. అన్నింటికీ రీ అప్పీల్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. నిర్దిష్ట కాలపరిమితిని తప్పనిసరిగా పాటించాలి. అత్యవసరంగా భూములను సేకరించే అధికారం ప్రభుత్వానికి ఉండదు. నిర్వాసితులైన భూ యజమానులకు భూమి ధరకు పట్టణ ప్రాంతాల్లో రెండు రెట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు రెట్ల పరిహారమివ్వాలి. గిరిజన ప్రాంతాల్లోని భూమికి నాలుగు రెట్ల పరిహారమివ్వాలి.

రాష్ట్రపతికి పంపిన సవరణల బిల్లు ఇదీ..
నిర్వాసిత కుటుంబాల భూములు, ఆస్తులను వారి ఇష్టపూర్వకంగా అమ్మడం ద్వారా అభివృద్ధి కార్యక్రమాల్లో వారు పాల్గొనేలా, భూసేకరణ చురుగ్గా సాగేలా చూడాలన్నది తెలంగాణ ప్రభుత్వ ఉద్దేశం. ఏ ప్రాంతంలో భూమిని సేకరిస్తే అక్కడి మార్కెట్‌ విలువ ఆధారంగా పరిహారం ఇవ్వడానికి యజమానులతో సంప్రదింపులు జరపాలి. అధిక మొత్తంలో పరిహారం, పునరావాసం, పునఃపరిష్కార హక్కులతోపాటు భూసేకరణ వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లు రూపొందించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement