
గడువుపై తేల్చని రాష్ట్రపతి
కొనసాగుతున్న ఉత్కంఠ
నేడు నిర్ణయం.. వారం గడువిచ్చే అవకాశం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును తిరిగి పంపించేందుకు అసెంబ్లీకి ఇచ్చిన గడువును పొడిగించే విషయంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గురువారం నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీ ప్రారంభమయ్యాక చాలా రోజుల పాటు సభ సజావుగా నడవనందువల్ల సభ్యులందరూ చర్చలో పాల్గొనలేకపోయారని, అందువల్ల బిల్లును తిరిగి పంపించేందుకు మరో 4 వారాల గడువు కావాలని కోరుతూ రాష్ట్రపతికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం లేఖ పంపిన విషయం తెలిసిందే. బిల్లును అసెంబ్లీకి పంపిస్తూ రాష్ట్రపతి ఇచ్చిన గడువు జనవరి 23తో ముగియనుండటంతో, రాష్ట్రప్రభుత్వం పంపిన లేఖపై రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. వారం రోజులు గడువు పొడిగించే అవకాశం ఉండవచ్చని హోంశాఖ వర్గాలు భావిస్తున్నాయి.
అయితే గడువు పొడిగింపునకు సంబంధించి శాసనసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ నిర్ణయించాక అసెంబ్లీ స్పీకర్ లేఖ రాయాల్సి ఉంటుందని.. అందుకు విరుద్ధంగా ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖలు రాయడంపై న్యాయపరమైన చర్చ జరుగుతోందని, అందువల్లే నిర్ణయం వెలువడడంలో ఆలస్యం అవుతుండవచ్చన్న వాదన కూడా వినిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన అభ్యర్థనపై అటార్నీ జనరల్ నుంచి రాష్ట్రపతి న్యాయ సలహా కూడా కోరారు. మరోవైపు తెలంగాణ ప్రాంత ప్రజా ప్రతినిధులు గడువు పొడిగింపు వద్దంటూ రాష్ట్రపతికి లేఖలు రాశారు. గడువు పొడిగింపు వల్ల ప్రయోజనం లేదని, సభాసమయాన్ని వృథాచేశారని, గడువు పొడిగిస్తే పార్లమెంటులో బిల్లు అనుమతి పొందేందుకు సమయం సరిపోదని వాటిలో పేర్కొన్నారు.